ఆరవ అధ్యాయం – ఆత్మసంయమయోగం sixth chapter

By | July 6, 2016

శ్రీమద్భగవద్గీత

ఆరవ అధ్యాయం

ఆత్మసంయమయోగం

శ్రీ భగవానువాచ:

అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః |
స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచాక్రియః || 1

శ్రీ భగవానుడు:

కర్మఫలాపేక్ష లేకుండా కర్తవ్యాలను ఆచరించేవాడే నిజమైన సన్యాసి, యోగి అవుతాడు. అంతేకానీ అగ్నిహోత్రాది కర్మలు మానివేసినంతమాత్రాన కాడు.

యం సన్న్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ |
న హ్యసన్న్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన || 2

పాండునందనా ! సన్యాసమూ, కర్మయోగమూ ఒకటే అని తెలుసుకో. ఎందువల్లనంటే సంకల్పాలను వదిలిపెట్టనివాడెవడూ యోగి కాలేడు.

ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే |
యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే || 3

ధ్యానయోగాన్ని సాధించదలచిన మునికి నిష్కామకర్మయోగమే మార్గం. యోగసిద్ధి పొందినవాడికి కర్మత్యాగమే సాధనం.

యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే |
సర్వసంకల్పసన్న్యాసీ యోగారూఢస్తదోచ్యతే || 4

ఇంద్రియ విషయాలమీద కాని, కర్మలమీదకాని ఆసక్తి లేకుండా సంకల్పాలన్నీ విడిచిపెట్టినవాడిని యోగారూఢుడంటారు.

ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః || 5

తనమనస్సే తనకు బంధువూ, శత్రువూ కూడా. కనుక మానవుడు తనను తానే ఉద్ధరించుకోవాలి. తన ఆత్మను అధోగతి పాలుచేసుకోకూడదు.

బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః |
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ || 6

మనస్సును స్వాధీనపరచుకున్నవాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించనవాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది.

జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః |
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః || 7

ఆత్మను జయించిన ప్రశాంతచిత్తుడు పరమాత్మ సాక్షాత్కారం నిరంతరం పొందుతూ శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, మానావమానాలపట్ల సమభావం కలిగివుంటాడు.

జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః |
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః || 8

శాస్త్రజ్ఞానంవల్ల, అనుభవజ్ఞానంవల్ల సంతృప్తి చెందినవాడు, నిర్వికారుడు, ఇంద్రియాలను జయించినవాడు, మట్టినీ రాతినీ బంగారాన్నీ సమదృష్టితో చూసేవాడూ యోగి అని చెప్పబడుతాడు.

సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు |
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే || 9

శ్రేయోభిలాషి, స్నేహితుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, విరోధి, బంధువు, సాధువు, దురాచారి—వీళ్ళందరిపట్ల సమబుద్ధి కలిగినవాడే సర్వోత్తముడు.

యోగీ యుఞ్జీత సతతమాత్మానం రహసి స్థితః |
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః || 10

యోగి ఏకాంత స్థలంలో ఒంటరిగా ఉండి, ఆశలను వదలి, ఇంద్రియాలనూ మనస్సునూ వశపరచుకుని, ఏమీ పరిగ్రహించకుండా చిత్తాన్ని ఆత్మమీదే నిరంతరం నిలపాలి.

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః |
నాత్యుచ్ఛ్రిత్రం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ || 11

ఎక్కువ ఎత్తూ పల్లమూకాని పరిశుద్ధమైన ప్రదేశంలో దర్భలు పరచి, దానిమీద చర్మమూ, ఆపైన వస్త్రమూ వేసి తన స్థిరమైన ఆసనాన్ని ఏర్పరచుకోవాలి.

తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః |
ఉపవిశ్యాసనే యుంజ్యాత్, యోగమాత్మవిశుద్ధయే || 12

ఆ ఆసనంమీద కూర్చుని, ఇంద్రియాలనూ మనస్సునూ స్వాధీన పరచుకుని, ఏకాగ్రచిత్తంతో ఆత్మశుద్ధికోసం యోగాభ్యాసం చేయాలి.

సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః |
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చా௨నవలోకయన్ || 13

ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః |
మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః || 14

శరీరమూ, శిరస్సూ, కంఠమూ కదలకుండా సమంగా, స్థిరంగా వుంచి, దిక్కులు చూడకుండా ముక్కుచివర దృష్టినిలిపి, ప్రశాంతచిత్తంతో భయం విడిచిపెట్టి, బ్రహ్మచర్యవ్రతం అవలంబించి, మనోనిగ్రహం కలిగి, బుద్ధిని నామీదే లగ్నం చేసి, నన్నే పతిగా, గతిగా భావించి ధ్యానంచేయాలి.

యుఞ్జన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః |
శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్ఛతి || 15

అలాంటి యోగి ఆత్మానుభవంమీద మనస్సును నిరంతరం నిలిపి, నా ఆధీనంలోవున్న మోక్షప్రదమైన శాంతిని పొందుతున్నాడు.

నాత్యశ్నతస్తు యోగో௨స్తి న చైకాంతమనశ్నతః |
న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున || 16

అర్జునా ! అమితంగా భుజించేవాళ్ళకీ, బొత్తిగా తిననివాళ్ళకీ, అత్యధికంగా నిద్రపోయేవాళ్ళకీ అసలు నిద్రపోనివాళ్ళకీ యోగం సిద్ధించదు.

యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు |
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా || 17

ఆహార విహారాలలో, కర్మలలో, నిద్రలో, మేల్కొనడంలో పరిమితి పాటించే యోగికి సర్వదుఃఖాలూ పోగొట్టే యోగసిద్ధి కలుగుతుంది.

యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే |
నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా || 18

మనస్సును వశపరచుకుని ఆత్మమీదే నిశ్చలంగా నిలిపి, సర్వావాంఛలూ విసర్జించినప్పుడు యోగసిద్ధి పొందాడని చెబుతారు.

యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా |
యోగినో యతచిత్తస్య యుఞ్జతో యోగమాత్మనః || 19

ఆత్మయోగం అభ్యసించేవాడి మనస్సు గాలిలేనిచోట వుండే దీపంలాగ నిలకడగా వుంటుంది.

యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా |
యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి || 20

సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్ |
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః || 21

యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః |
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే || 22

తం విద్యాద్దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్ |
స నిశ్చయేన యోక్తవ్యో యోగో௨నిర్విణ్ణచేతసా || 23

ఏ స్థితిలో మనస్సు యోగాభ్యాసంవల్ల నిగ్రహించబడి శాంతిని పొందుతుందో, యోగి ఎప్పుడు పరిశుద్ధమైన మనస్సుతో పరమాత్మను తనలోనే సందర్శిస్తూ సంతోషిస్తున్నాడో; ఇంద్రియాలకు గోచరించకుండా బుద్ధివల్లనే గ్రహించబడే అనంతసుఖాన్ని అనుభవిస్తున్నాడో, ఆత్మతత్వంనుంచి ఏ మాత్రమూ చలించడో; దేనినిపొంది, దానికి మించిన లాభం మరొకటి లేదని భావిస్తాడో, ఏ స్థితిలో స్థిరంగా వుండి దుర్భరదుస్సహదుఃఖానికయినా కలత చెందడో; దుఃఖాలకు దూరమైన అలాంటి దానినే యోగమంటారు. దిగులు పడకుండా దీక్షతో ఆ యోగాన్ని అభ్యసించాలి.

సంకల్పప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః |
మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః || 24

శనైః శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగృహీతయా |
ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ || 25

సంకల్పంవల్ల కలిగే సకలవాంఛలనూ సంపూర్ణంగా విడిచిపెట్టి, ఇంద్రియాలన్నిటినీ సమస్తవిషయాల నుంచి మనస్సుతోనే మళ్ళించి, బుద్ధి ధైర్యంతో మనస్సును ఆత్మమీదే నెమ్మదిగా నిలిపి చిత్తశాంతి పొందాలి. ఏ మాత్రమూ ఇతర చింతనలు చేయకూడదు.

యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ |
తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ || 26

చంచలమూ అస్థిరమూ అయిన మనస్సు ఏయే విషయాల మీదకు వెడుతుందో ఆయా విషయాలనుంచి దానిని మళ్ళించి ఆత్మమీదే నిలకడగా వుంచాలి.

ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ |
ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషమ్ || 27

ప్రశాంతమైన మనస్సుకలిగినవాడు, కామక్రోధాది ఉద్రేకకారణాలకు అతీతుడు, పాపరహితుడు, బ్రహ్మస్వరూపుడు అయిన యోగపురుషుడికి పరమ సుఖం లభిస్తుంది.

యుఞ్జన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః |
సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే || 28

ఇలాగ మనస్సు నెప్పుడూ ఆత్మమీద లగ్నంచేసి పాపరహితుడైన యోగి అతి సులభంగా సర్వోత్కృష్టమైన సుఖం పొందుతాడు.

సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః || 29

యోగసిద్ధి పొందినవాడు సమస్తభూతాలపట్ల సమభావం కలిగి సర్వభూతాలలో తన ఆత్మనూ, తన ఆత్మలో సర్వభూతాలనూ సందర్శిస్తాడు.

యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి |
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి || 30

అన్ని భూతాలలో నన్నూ, నాలో అన్ని భూతాలనూ చూసేవాడికి నేను లేకుండా పోను; నాకు వాడు లేకుండా పోడు.

సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః |
సర్వథా వర్తమానో௨పి స యోగీ మయి వర్తతే || 31

సమస్తభూతాలలో వున్న నన్ను భేదభావం లేకుండా సేవించే యోగి ఎలా జీవిస్తున్నప్పటికీ నాలోనే వుంటాడు.

ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో௨ర్జున |
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః || 32

అర్జునా ! సమస్త జీవుల సుఖదుఃఖాలను తనవిగా తలచేవాడు యోగులలో శ్రేష్టుడని నా అభిప్రాయం.

అర్జున ఉవాచ:

యో௨యం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన |
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరామ్ || 33

అర్జునుడు: మధుసూదనా! మనస్సు నిలకడలేనిదికావడంవల్ల, నీవు ఉపదేశించిన ఈ జీవాత్మపరమాత్మల సమత్వయోగాన్ని స్థిరమైన స్థితిలో చూడలేకపోతున్నాను.

చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్ |
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ || 34

కృష్ణా! మనస్సు చాలా చంచలం, బలవత్తరం, సంక్షోభకరం. అలాంటి మనస్సును నిగ్రహించడం వాయువును నిరోధించడంలాగ దుష్కరమని భావిస్తున్నాను.

శ్రీ భగవానువాచ:

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ |
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే || 35

శ్రీ భగవానుడు: అర్జునా! మనస్సు చంచల స్వభావం కలిగిందీ, నిగ్రహించడానికి శక్యం కానిదీ అనడంలో సందేహం లేదు. అయితే దానిని అభ్యాసంవల్ల, వైరాగ్యంవల్ల వశపరచుకోవచ్చు.

అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః |
వశ్యాత్మనా తు యతతా శక్యో௨వాప్తుముపాయతః || 36

ఆత్మనిగ్రహం లేనివాడికి యోగం సిద్ధించదని నా ఉద్దేశం. ఆత్మనిగ్రహం వుంటే అభ్యాసం, వైరాగ్యం అనే ఉపాయాలతో యోగం పొందవచ్చు.

అర్జున ఉవాచ:

అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః |
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి || 37

అర్జునుడు: శ్రద్ధవున్నప్పటికీ మనో నిగ్రహం లోపించిన కారణంగా యోగంలో చిత్తం చలించినవాడు యోగసంసిద్ధి పొందకుండా ఏ గతి పొందుతాడు?

కచ్చిన్నోభయవిభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి |
అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి || 38

అర్జునుడు: కృష్ణా! మోక్షసంపాదన మార్గంలో నిలకడలేనివాడు ఇహపరసౌఖ్యాలు రెండింటికీ భ్రష్టుడై చెదరిన మేఘాలలాగ చెడిపోడు కదా!

ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః |
త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే || 39

కృష్ణా! ఈ నా సందేహాన్ని సంపూర్ణంగా నివారించడానికి నీవే సమర్థుడవు. ఈ సంశయాన్ని తీర్చడానికి నిన్ను మించినవాడు మరొకడెవ్వడూ లేడు.

శ్రీ భగవానువాచ:

పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే |
న హి కల్యాణకృత్ కశ్చిద్దుర్గతిం తాత గచ్ఛతి || 40

శ్రీ భగవానుడు: అర్జునా! యోగభ్రష్టుడికి ఈ లోకంలో కాని, పరలోకంలోకాని ఎలాంటి హానీ కలుగదు. నాయనా! మంచిపనులు చేసిన మానవుడెవడూ దుర్గతి పొందడు.

ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః |
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో௨భిజాయతే || 41

యోగభ్రష్టుడు పుణ్యకర్మలు చేసేవాడు పొందే ఉత్తమలోకాలు చేరి, చిరకాలం అక్కడ భోగాలు అనుభవించిన అనంతరం సదాచార సంపన్నులైన భాగ్యవంతుల యింట్లో జన్మిస్తాడు.

అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ |
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ || 42

లేకపోతే బుద్ధిమంతులైన యోగుల వంశంలోనే పుడుతాడు. అయితే అలాంటి జన్మ ఈ లోకంలో పొందడం ఎంతో దుర్లభం.

తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్ |
యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన || 43

అర్జునా! అలా యోగుల కులంలో పుట్టినవాడు పూర్వజన్మ సంస్కార విశేషంవల్ల సంపూర్ణయోగసిద్ధికోసం గతంలో కంటే ఎక్కువగా ప్రయత్నం కొనసాగిస్తాడు.

పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశో௨పి సః |
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే || 44

పూర్వజన్మలోని అభ్యాసబలం మూలంగా ఆ యోగభ్రష్టుడు తాను తలపెట్టకపోయినా మళ్ళీ యోగసాధనవైపుకు లాగబడుతాడు. యోగస్వరూపాన్ని తెలుసుకోదలచినవాడుకూడా వేదాలలో వివరించబడ్డ కర్మలు ఆచరించేవాడిని మించిపోతాడు.

ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః |
అనేకజన్మసంసిద్ధః తతో యాతి పరాం గతిమ్ || 45

పట్టుదలతో ప్రయత్నించే యోగి పాపవిముక్తుడై అనేక జన్మలకు సంబంధించిన సాధనాసంపర్కంవల్ల యోగసిద్ధి, తరువాత మోక్షఫలం పొందుతాడు.

తపస్విభ్యో௨ధికో యోగీ జ్ఞానిభ్యో௨పి మతో௨ధికః |
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున || 46

అర్జునా! తపస్సు చేసేవాళ్ళకంటే, శాస్త్రజ్ఞానం కలవాళ్ళకంటే, యోగులకంటే ధ్యానయోగి గొప్పవాడు. కనుక నీవు ధ్యానయోగం సాధించాలి.

యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా |
శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్తతమో మతః || 47

యోగులందరిలోనూ మనస్సు నా మీదే నిలిపి, శ్రద్ధాభక్తులతో నన్ను సేవించేవాడు ఉత్తముడని నా వుద్దేశం.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని “ఆత్మసంయమయోగం” అనే ఆరవ అధ్యాయం సమాప్తం.