పదమూడవ అధ్యాయం క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం 13 th Chapter

By | July 1, 2016

My Guru Bhagavath Geetha – Hanuman Mathaji

శ్రీమద్భగవద్గీత

పదమూడవ అధ్యాయం

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగం

అర్జున ఉవాచ

ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ |
ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ || 1

అర్జునుడు: కేశవా! ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం వీటన్నిటి గురించి తెలుసుకోవాలని నా అభిలాష.

శ్రీ భగవానువాచ

ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే |
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః || 2

శ్రీభగవానుడు: కౌంతేయా! ఈ శరీరమే క్షేత్రమనీ, దీనిని తెలుసుకుంటున్నవాడే క్షేత్రజ్ఞుడనీ క్షేత్రక్షేత్రజ్ఞుల తత్వం తెలిసినవాళ్ళు చెబుతారు.

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత |
క్షేత్రక్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ || 3

ఆర్జునా! క్షేత్రాలన్నింటిలోనూ ఉన్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకో. క్షేత్రానికి క్షేత్రజ్ఞునికి సంబంధించిన జ్ఞానమే సరైన జ్ఞానమని నా ఉద్దేశం.

తత్‌క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ |
స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు || 4

ఆ క్షేత్రం ఆకారవికారాలు, పుట్టుపూర్వోత్తరాలగురించీ క్షేత్రజ్ఞుడి స్వరూప స్వభావ ప్రభావాల గురించీ క్లుప్తంగా చెబుతాను విను.

ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ |
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః || 5

ఋషులు ఎన్నో విధాలుగా ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్త్వాన్ని చాటిచెప్పారు. వేరువేరుగా వేదాలూ, సహేతుకంగా, సందేహరహితంగా సవివరంగా బ్రహ్మసూత్రాలూ ఈ స్వరూపాన్ని నిరూపించాయి.

మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ |
ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియగోచరాః || 6

ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః |
ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్ || 7

పంచమహాభూతాలు, అహంకారం, బుద్ధి, మూలప్రకృతి, పది ఇంద్రియాలు, మనస్సు, ఐదు ఇంద్రియ విషయాలు, కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం, దేహేంద్రియాల సమూహం, తెలివి, ధైర్యం-వికారాలతోపాటు వీటి సముదాయాన్ని సంగ్రహంగా క్షేత్రమని చెబుతారు.

అమానిత్వమదంభిత్వమ్ అహింసా క్షాంతిరార్జవమ్ |
ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః || 8

ఇంద్రియార్థేషు వైరాగ్యమ్ అనహంకార ఏవ చ |
జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్ || 9

అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు |
నిత్యం చ సమచిత్తత్వమ్ ఇష్టానిష్టోపపత్తిషు || 10

మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ |
వివిక్తదేశసేవిత్వమ్ అరతిర్జనసంసది || 11

అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్ |
ఏతద్‌జ్ఞానమితి ప్రోక్తమ్ అజ్ఞానం యదతో௨న్యథా || 12

తనని తాను పొగడుకోకపోవడం, కపటం లేకపోవడం, అహింస, సహనం, సరళత్వం, సద్గురుసేవ, శరీరాన్నీ మనసునూ పరిశుద్ధంగా వుంచుకోవడం, స్థిరత్వం, ఆత్మ నిగ్రహం, ఇంద్రియవిషయాలపట్ల విరక్తి కలిగి ఉండటం, అహంకారం లేకపోవడం, పుట్టుక, చావు, ముసలితనం, రోగం అనేవాటివల్ల కలిగే దుఃఖాన్నీ దోషాన్నీ గమనించడం, దేనిమీదా ఆసక్తి లేకపోవడం, ఆలుబిడ్డలు, ఇళ్ళువాకిళ్ళ పట్ల వ్యామోహం లేకపోవడం, శుభాశుభాలలో సమభావం కలిగి ఉండటం, నామీద అనన్యమూ అచంచలమూ అయిన భక్తి కలిగి ఉండటం, ఏకాంత ప్రదేశాన్ని ఆశ్రయించడం, జనసమూహం మీద ఇష్టం లేక పోవడం, ఆత్మ ధ్యానంలో నిరంతరం నిమగ్నమై ఉండటం, తత్త్వజ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాన్ని గ్రహించడం- ఇదంతా జ్ఞానమని చెప్పబడింది. దీనికి విరుద్ధమయింది అజ్ఞానం.

జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వామృతమశ్నుతే |
అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే || 13

ఏది తెలుసుకోదగ్గదో, దేనిని తెలుసుకొంటే మానవుడు మోక్షం పొందుతాడో, అనాది అయిన ఆ పరబ్రహ్మాన్ని గురించి చెప్తాను. దానిని సత్తనికాని అసత్తనికాని వివరించడానికి వీలులేదు.

సర్వతః పాణిపాదం తత్ సర్వతో௨క్షిశిరోముఖమ్ |
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి || 14

అది అంతటా చేతులూ, కాళ్ళూ, తలలూ, ముఖాలూ, చెవులూ కలిగి సమస్త జగత్తునీ ఆవరించి ఉన్నది.

సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితమ్ |
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ || 15

ఆ బ్రహ్మం అన్ని ఇంద్రియాల గుణాలనూ ప్రకాశింపచేస్తున్నా సర్వేంద్రియాలూ లేనిది; దేనినీ అంటకపోయినా అన్నిటికీ ఆధారం; గుణాలు లేనిదైనా గుణాలను అనుభవిస్తుంది.

బహిరంతశ్చ భూతానామ్ అచరం చరమేవ చ |
సూక్ష్మత్వాత్‌తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ || 16

అది సర్వభుతాల వెలపల, లోపల కూడా ఉన్నది; కదలదు, కదులుతుంది; అతిసూక్ష్మస్వరూపం కావడం వల్ల తెలుసుకోవడానికి శక్యంకాదు; అది ఎంతో దూరంలోనూ బాగా దగ్గరలోనూ ఉన్నది.

అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ |
భూతభర్తృ చ తజ్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ || 17

ఆ బ్రహ్మం ఆకారమంతా ఒకటే అయీనప్పటికీ సర్వప్రాణులలోనూ ఆకారభేదం కలిగినదానిలాగా కనపడుతుంది. అది భూతాలన్నిటినీ పోషిస్తుంది, భుజిస్తుంది, సృజిస్తుంది.

జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే |
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్ || 18

అది జ్యోతులన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. అజ్ఞానాంధకారానికి అతీతమూ, జ్ఞానస్వరూపమూ, జ్ఞానంతో తెలుసుకోదగ్గదీ, జ్ఞానంతో పొందదగ్గదీ అయి అందరి హృదయాలలో అధిష్ఠించి వున్నది.

ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః |
మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే || 19

ఇలా క్షేత్రం, జ్ఞానం, జ్ఞేయం గురించి క్లుప్తంగా చెప్పడం జరిగినది. నా భక్తుడు ఈ తత్త్వాన్ని తెలుసుకుని మోక్షం పొందడానికి అర్హుడవుతున్నాడు.

ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి |
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసంభవాన్ || 20

ప్రకృతి, పురుషుడు- ఈ ఉభయులకీ ఆదిలేదని తెలుసుకో. వికారాలు, గుణాలు ప్రకృతినుంచి పుడుతున్నాయని గ్రహించు.

కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే |
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే || 21

శరీరం, ఇంద్రియాల ఉత్పత్తికి ప్రకృతే హేతువనీ, సుఖదుఃఖాలను అనుభవించేది పురుషుడనీ చెబుతారు.

పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ |
కారణం గుణసంగో௨స్య సదసద్యోనిజన్మసు || 22

ప్రకృతిలో వుండే పురుషుడు ప్రకృతివల్ల కలిగే గుణాలను అనుభవిస్తాడు. ఆ గుణాలపట్ల కల ఆసక్తిని బట్టే పురుషుడు ఉచ్చనీచ జన్మలు పొందుతాడు.

ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః |
పరమాత్మేతి చాప్యుక్తో దేహే௨స్మిన్ పురుషః పరః || 23

ఈ శరీరంలో అంటీ అంటనట్లుగా ఉండే పరమపురుషుణ్ణి సాక్షి, అనుమతించేవాడు, భరించేవాడు, అనుభవించేవాడు, మహేశ్వరుడు, పరమాత్మ అని చెబుతారు.

య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైస్సహ |
సర్వథా వర్తమానో௨పి న స భూయో௨భిజాయతే || 24

ఇలా పురుషుణ్ణి గురించీ, గుణాలతో ఉన్న ప్రకృతిని గురించీ తెలుసుకున్న వాడు ఎలా జీవించినా పునర్జన్మ పొందడు.

ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా |
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే || 25

ధ్యానయోగంద్వారా కొంతమంది, జ్ఞానయోగం వల్ల మరికొంతమంది, కర్మయోగంతో ఇంకొంతమంది పరమాత్మను తమలో దర్శిస్తున్నారు.

అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే |
తే௨పి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః || 26

అలా తెలుసుకోలేని మరికొంతమంది, గురువుల ఉపదేశం పొంది ఉపాసిస్తారు. వినడంలో శ్రద్ధ కలిగిన వాళ్ళు కూడా సంసార రూపమైన మృత్యువు నుంచి ముక్తి పొందుతారు.

యావత్సంజాయతే కించిత్ సత్త్వం స్థావరజంగమమ్ |
క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్ తద్విద్ధి భరతర్షభ || 27

అర్జునా ! ఈ ప్రపంచంలో పుడుతున్న చరాచరాత్మకమైన ప్రతి వస్తువూ ప్రకృతి పురుషుల కలయిక వలల్నే కలుగుతున్నదని తెలుసుకో.

సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ |
వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి || 28

శరీరాలు నశిస్తున్నా తాను నశించకుండా సమస్త ప్రాణులలోనూ సమానంగా వుండే పరమాత్మను చూసేవాడే సరైన జ్ఞాని.

సమం పశ్యన్‌హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్ |
న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్ || 29

పరమాత్మను సర్వత్రా సమానంగా వీక్షించేవాడు తనను తాను హింసించుకోడు. అందువల్ల అతను మోక్షం పొందుతాడు.

ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః |
యః పశ్యతి తథాత్మానమ్ అకర్తారం స పశ్యతి || 30

ప్రకృతివల్లనే సమస్త కర్మలూ సాగుతున్నాయనీ, తానేమీ చేయడం లేదనీ తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని.

యదా భూతపృథగ్భావమ్ ఏకస్థమనుపశ్యతి |
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా || 31

వేరువేరుగా కనుపించే సర్వభూతాలూ ఒకే ఆత్మలో వున్నాయనీ, అక్కడనుంచే విస్తరిస్తున్నాయనీ గ్రహించినప్పుడు మానవుడు బ్రహ్మపదం పొందుతాడు.

అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః |
శరీరస్థో௨పి కౌంతేయ న కరోతి న లిప్యతే || 32

అర్జునా! శాశ్వతుడైన పరమాత్మ పుట్టుకలేనివాడూ, గుణరహితుడూ కావడంవల్ల దేహంలో వున్నా దేనికీ కర్త కాడు. కనుక కర్మఫలమేదీ అతనిని అంటదు.

యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే |
సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే || 33

అంతటా వ్యాపించివున్నా, సూక్ష్మమైన ఆకాశం దేనినీ అంటనట్లు శరీరమంతటా వున్నా ఆత్మ కలుషితం కాదు.

యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః |
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత || 34

అర్జునా! సూర్యుడొక్కడే ఈ సమస్త లోకాన్నీ ప్రకాశింపచేస్తున్నట్లే; క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రమంతటినీ ప్రకాశింపచేస్తున్నాడు.

క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమ్ అంతరం జ్ఞానచక్షుషా |
భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాంతి తే పరమ్ || 35

ఇలా క్షేత్రక్షేత్రజ్ఞుల భేదాన్ని ప్రకృతి గుణాలనుంచి ప్రాణులు మోక్షం పొందే విధానాన్ని జ్ఞానదృష్టితో తెలుసుకున్నవాళ్ళు పరమపదం పొందుతారు.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని ” క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం” అనే పదమూడవ అధ్యాయం సమాప్తం.