శ్రీమద్భగవద్గీత, మొదటి అధ్యాయం, అర్జునవిషాదయోగం-Bhagavath Geetha 1st Adhyamu – Telugu

By | June 24, 2016

పార్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితామ్ పురాణ మునినా మధ్యే మహా భారతం
అద్వైతామృత వర్షిణీమ్ భగవతీమ్ అష్టాదశాధ్యాయినీమ్
అంబత్వా మనుసందదామి భగవత్ గీతే భవ ద్వేషిణీం //

My Guru Bhagavath Geetha – Hanuman Mathaji

శ్రీమద్భగవద్గీత
మొదటి అధ్యాయం
అర్జునవిషాదయోగం

ధృతరాష్ట్ర ఉవాచ:

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాండవాశ్చైవ కి మకుర్వత సంజయ || 1
ధృతరాష్టృడు: సంజయా ! ధర్మానికి నిలయమైన కురుక్షేత్రంలో యుద్ధసన్నద్ధులై నిలిచిన నా వాళ్ళూ, పాండవులూ ఏం చేశారు?

సంజయ ఉవాచ:

దృష్ఠ్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా |
ఆచార్య ముపసంగమ్య రాజా వచన మబ్రవీత్ || 2
సంజయుడు: యుద్ధానికి సంసిద్ధులైవున్న పాండవ సైన్యాలను చూసి, దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు.

పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూమ్ |
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా || 3
ఆచార్యా ! మీ శిష్యుడూ, ధీమంతుడూ అయిన ధృష్టద్యుమ్నుడు వ్యూహం పన్నిన పాండవుల మహాసైన్యాన్ని చూడండి.

అత్ర శూరా మహేష్వాసాః, భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపద శ్చమహారథః || 4

ధృష్టకేతు శ్చేకితానః కాశీరాజ శ్చ వీర్యవాన్ |
పురుజిత్కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుఙ్గవః || 5

యుధామన్యుశ్చ విక్రాన్తః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః || 6
ఈ పాండవుల సైన్యంలో ధైర్య సాహసవంతులూ, అస్త్ర విద్యానిపుణులూ, శౌర్యంలో భీమార్జున సమానులూ ఉన్నారు. సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైభ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు కూడా ఉన్నారు. వీళ్ళంతా మహారథులే.

అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే || 7
బ్రాహ్మణోత్తమా ! ఇక మన సైన్యంలో ఉన్న నాయకులూ, సుప్రసిద్ధులూ అయిన వాళ్ళ గురించి కూడా చెబుతాను.

భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిఞ్జయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ || 8

అన్యే చ బహవశ్శూరాః మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః || 9
మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి వున్నారు. ఇంకా ఎంతోమంది శూరాగ్రేసరులూ, యుద్ధవిశారదులూ నా కోసం జీవితాల మీద ఆశ వదలి సిద్ధంగా వున్నారు.

అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |
పర్యాప్తం త్విద మేతేషాం బలం భీమాభిరక్షితమ్ || 10
భీష్ముడు రక్షిస్తున్న మన సైన్యం అపరిమితం, భీముడి రక్షణలో వున్న పాండవ సైన్యం పరిమితం.

అయనేషు చ సర్వేషు యథాభాగ మవస్థితాః |
భీష్మమేవాభిరక్షంతు భవంత స్సర్వ ఏవ హి || 11
అందువల్ల మీరంతా యుద్ధరంగంలో మీ మీ స్థానాలు వదిలిపెట్టకుండా ఉండి భీష్ముణ్ణి కాపాడాలి.

తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః |
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ || 12
అలా అంటున్న దుర్యోధనుడికి సంతోషం కలిగిస్తూ కురువృద్ధుడైన భీష్ముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు.

తత శ్శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః |
సహసై వాభ్యహన్యంత స శబ్దస్తుములో௨భవత్ || 13
వెంటనే కౌరవవీరుల శంఖభేరీ ఢక్కామృదంగ గోముఖాది ధ్వనులతో దిక్కులన్నీ పిక్కటిల్లాయి.

తత శ్శ్వే తైర్హయై ర్యుక్తే మహతి స్యందనే స్థితౌ |
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః || 14
అప్పుడు తెల్లగుర్రాలు కట్టిన మహారథం మీద కూర్చున్న కృష్ణార్జునులు కూడా తమ దివ్యశంఖాలు పూరించారు.

పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః |
పౌండ్రం ధధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః || 15

అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః |
నకుల స్సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ || 16

కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి శ్చాపరాజితః || 17

ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ || 18
శ్రీకృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం, భీముడు పౌండ్రకం ఊదారు. ధర్మరాజు అనంతవిజయం, నకుల సహదేవులు సుఘోషమణిపుష్పకాలూ పూరించారు. కాశీరాజు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ఉపపాండవులు, అభిమన్యుడు తమ తమ శంఖాలు అన్నివైపులా ఊదారు.

స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ || 19
ఆ శంఖధ్వనులు భూమి ఆకాశాలను దద్దరిల్లజేస్తూ కౌరవ వీరుల హృదయాలను బద్దలు చేశాయి.

అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |
ప్రవృత్తే శస్త్రసంపాతే ధను రుద్యమ్య పాండవః || 20

అర్జున ఉవాచ:
హృషీకేశం తదా వాక్యం ఇద మాహ మహీపతే !
సేనయో రుభయో ర్మధ్యే రథం స్థాపయ మే௨చ్యుత ! 21
కురురాజా ! అప్పుడు అర్జునుడు యుద్ధసన్నద్ధులైన దుర్యోధనాదులను చూసి, గాండీవం ఎత్తిపట్టి శ్రీ కృష్ణుడితో ” అచ్యుతా ! రెండు సేనల మధ్య నా రథాన్ని నిలబెట్టు” అన్నాడు.

యావ దేతాన్ నిరీక్షే௨హం యోద్దుకామా నవస్థితాన్ |
కైర్మయా సహ యోద్ధవ్యమ్ అస్మిన్ రణసముద్యమే || 22

యోత్స్యమానా నవేక్షే௨హం య ఏతే௨త్ర సమాగతాః |
ధార్తరాష్ట్రస్య దుర్భుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః || 23
“కృష్ణా ! శత్రు వీరులను చూడనీ, దుష్టుడైన దుర్యోధనుడికి సాయం చేయడనికి సమరరంగానికి వచ్చిన వాళ్ళందరినీ చూడాలనుకుంటున్నాను” అన్నాడు అర్జునుడు.

సంజయ ఉవాచ:

ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయో రుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ || 24

భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి || 25
సంజయుడు: ధృతరాష్ట్రా ! అర్జునుడి మాటలు ఆలకించిన శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య భీష్మద్రోణాదులకు ఎదురుగా రథం ఆపి, అక్కడ చేరిన కౌరవ బలాన్ని అవలోకించమన్నాడు.

తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ |
ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం స్తథా || 26

శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయో రుభయో రపి |
తాన్ సమీక్ష్య స కౌన్తేయః సర్వాన్ బంధూనవస్థితాన్ || 27
అప్పుడు అర్జునుడు ఉభయ సేనలలోనూ యుద్ధానికి సిద్ధంగా వున్న తన తండ్రులనూ, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను; పౌత్రులనూ, మిత్రులనూ, బంధువులందరినీ చూశాడు. చూసి మిక్కిలి దయగలిగి దుఃఖిస్తూ విశేషకృపాంతరంగుడూ, విషాదవశుడు అయి ఇలా అన్నాడు.

అర్జున ఉవాచ:
కృపయా పరయా௨௨విష్టో విషీదన్నిద మబ్రవీత్.
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ || 28

సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి |
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే || 29

గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే |
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః || 30
కృష్ణా ! యుద్ధాసక్తులై ఎదురుగా వున్న చుట్టాలను చూడగానే నా అవయవాలు తడబడుతున్నాయి. నోరు ఎండిపోతున్నది. శరీరమంతా గగుర్పాటుతో కంపిస్తున్నది. గాండీవం చేతిలోంచి జారిపోతున్నది. దేహం మండుతున్నది. నిలబడడానికి కూడా శక్తి లేదు. నా మనస్సు తల్లడిల్లుతున్నది.

నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ |
న చ శ్రేయో௨నుపశ్యామి హత్వా స్వజన మాహవే || 31
కేశవా ! దుశ్శకునాలు కానవస్తున్నాయి. యుద్ధంలో బంధువులను చంపడం వల్ల కలిగే మేలు ఏమీ గోచరించడం లేదు.

న కాంక్షే విజయం కృష్ణ ! న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవింద ! కిం భోగై ర్జీవితేన వా? || 32
కృష్ణా ! యుద్ధవిజయం మీద, రాజ్యసుఖాలమీద నాకు ఆసక్తిలేదు. రాజ్యభోగాలతో కూడిన జీవితం వల్ల ప్రయోజనం ఏమీ లేదు.

యేషా మర్థే కాంక్షితం నో రాజ్యం భోగాస్సుఖాని చ |
త ఇమే௨వస్థితా యుద్ధే ప్రాణాం స్త్యక్త్వా ధనాని చ || 33

ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః |
మాతులాశ్శ్వశురాః పౌత్రాః స్యాలాస్సబంధిన స్తథా || 34
ఎవరికోసం రాజ్యం, భోగం, సుఖం కోరుతున్నామో వాళ్ళంతా—గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరదులు, ఇతర బంధువులూ—ధన ప్రాణాల మీద ఆశవదలి ఈ రణరంగంలోనే ఉన్నారు.

ఏతా న్న హంతు మిచ్చామి ఘ్నతో௨పి మధుసూదన |
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే || 35
మధుసూదనా ! వాళ్ళు నన్ను చంపితే చంపనీ, ముల్లోకాలనూ ఏలే అవకాశం కలిగినా నేను మాత్రం వాళ్ళను వధించదలచుకోలేదు. అలాంటప్పుడు ఈ రాజ్యం కోసం వాళ్ళను చంపుతానా ?

నిహత్య ధార్తరాష్ట్రా న్నః కా ప్రీతి స్స్యా జ్జనార్దన? |
పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతా నాతతాయినః || 36
దుర్యోధనాదులను సంహరించి మనం పొందే సంతోషమేమిటి? జనార్దనా ! ఈ పాపాత్ములను చంపితే మనకూ పాపమే.

తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ |
స్వజనం హి కథం హత్వా సుఖిన స్స్యామ మాధవ || 37
బంధువులైన దుర్యోధనాదులను చంపడం మనకు మంచిదికాదు. మాధవా ! స్వజనాన్ని వధించి ఎలా సుఖపడగలం ?

యద్య ప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః |
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ || 38
రాజ్యకాంక్షాపరులైన కౌరవులు వంశనాశనం, మిత్రద్రోహం వల్ల కలిగే పాతకాన్ని గ్రహించలేక పోతున్నారు.

కథం న జ్ఞేయ మస్మాభిః? పాపాదస్మాన్నివర్తితుమ్ |
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భి ర్జనార్దన || 39
జనార్దనా ! వంశక్షయంవల్లవచ్చే దోషాన్ని బాగా తెలిసిన మనమైనా ఆ పాపం నుంచి ఎందుకు తప్పించుకోకూడదు ?

కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా స్సనాతనాః |
ధర్మే నష్టే కులం కృత్స్నమ్ అధర్మో௨భిభవత్యుత || 40
వంశనాశనంతో ప్రాచీన కుల ధర్మాలు నశిస్తాయి. కుల ధర్మాలు నశించిన వంశమంతటా అధర్మం అలుముకుంటుంది.

అధర్మా௨భిభవాత్ కృష్ణ! ప్రదుష్యన్తి కులస్త్రియః |
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః || 41
కృష్ణా ! అధర్మం ప్రబలితే కులస్త్రీలు చెడిపోతారు. దానితో జాతి సంకరం జరుగుతుంది.

సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః || 42
వర్ణసంకరం వల్ల కులానికీ, కులనాశకులకూ కలిగేది నరకమే. వారి పితృదేవతలు పిండోదక కార్యాలు లేక అధోగతి పాలవుతారు.

దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః |
ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః || 43
కులాన్ని నాశనంచేసే వాళ్ళమూలంగా కలిగే వర్ణసాంకర్యం కారణంగా శాశ్వతాలైన జాతిధర్మాలూ, కులధర్మాలూ అడుగంటిపోతాయి.

ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |
నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ || 44
జనార్దనా ! కులధర్మాలు నశించిన కుటుంబాలవారు శాశ్వత నరక వాసులవుతారని వింటున్నాము.

అహో ! బత ! మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |
యద్రాజ్యసుఖలోభేన, హంతుం స్వజన ముద్యతాః || 45
ఎంత ఆశ్చర్యం ! రాజ్యలోభంతో బంధువులను చంపడానికి పూనుకుని, ఘోరపాపాలు చేయడానికి సిద్ధపడ్డాం కదా.

యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ || 46
ఆయుధాలు ధరించిన ధార్తరాష్ట్రులు అస్త్రశస్త్రాలు విసర్జించిన నన్ను యుద్ధంలో సంహరిస్తే అది నాకు మరింత మంచిది.

సంజయ ఉవాచ:

ఏవ ముక్త్వా௨ర్జున స్సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం శోక సంవిగ్న మానసః || 47
సంజయుడు: అర్జునుడు అలా చెప్పి దుఃఖాక్రాంతుడై విల్లమ్ములు విడిచిపెట్టి రణరంగంలో రథం మీద చతికిలబడ్డాడు.
ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని “అర్జున విషాదయోగం” అనే మొదటి అధ్యాయం సమాప్తం.

Related Images: