ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది. Hanuman Nava Avatharams

By | May 23, 2017

ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది. హనుమంతుడు కూడా దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.
1. ప్రసన్నాంజనేయస్వామి. 2. వీరాంజనేయస్వామి. 3. వింశతిభుజాంజనేయస్వామి. 4. పంచముఖాంజనేయస్వామి. 5. అష్టాదశ భుజాంజనేయస్వామి. 6. సువర్చలాంజనేయస్వామి. 7. చతుర్భుజాంజనేయస్వామి. 8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి. 9. వానరాకార ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు – శనివారం, మంగళవారం మరియు గురువారం. పురాణకథ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు.
శ్రీ ఆంజనేయం శిరసా నమామి త్రేతాయుగమున దుష్ట శిక్షణ – శిష్ట రక్షణ కొఱకు, దానవులను సంహరించి ధర్మపాలన సంస్థాపన చేయుటకై మానవునుగా హరి, వానరయూధ ముఖ్యునిగా రుద్రాంశతో ఆంజనేయుడు జన్మించారు. ఒకప్పుడు ‘పుంజికస్థల ‘ అను అప్సరస శాపవశంచేత భూలోకమున అంజనగా జన్మించి వానర రాజైన కేసరిని వివాహమాడింది. ఆమె మహా పతివ్రత. వివాహమై చాలకాలమైనా ఆమెకు సంతానం కలుగకపోవడంతో సంతానంకై కఠోర తపస్సు ప్రారంభించింది. ఆమె తపస్సుకు మెచ్చి వాయుదేవుడు ప్రతినిత్యం ఒక ఫలంను అనుగ్రహిస్తే దానిని వాయుదేవుని ప్రసాదంగా స్వీకరించేది. ఒకనాడు శివపార్వతులు ఆ ప్రాంతమున స్వేచ్ఛా విహారులై వానరరూపాల్లో క్రీడిస్తుండగా స్ఖలించిన శివుని వీర్యమును భద్రపరిచిన వాయుదేవుడు ఆ వీర్యమును ఒక ఆకు దొప్పలో పండుగా మార్చి వాయువీవనచే అంజనాదేవి ముందు పడవేయగా ఆ శివవీర్యాన్ని ఆనాటి వాయుప్రసాదముగా భావించి అంజన భుజించినది. ఫలితంగా తక్షణమే గర్భం దాల్చింది. తనకు గర్భము ఎలా వచ్చిందో తెలియక దుఃఖించి దానికి కారణమైన వారిని శపించబోగా, వాయుదేవుడు ప్రత్యక్షమై ఆమె గర్భమున శివాంశతో పుత్రుడు జన్మిస్తాడని, అతడు వాయుపుత్రుడుగా వాసికెక్కుతాడని అభయమిస్తాడు. వానరరాజు అయిన కేసరి దీనిని దివ్యప్రసాదంగా భావించి సమ్మతించాడు. అటుపై – వైశాఖ మాసం, కృష్ణ పక్షం, తిధి దశమి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నం, వైధృతి నామయోగం, గ్రహాలన్నీ శుభస్థానాలలో ఉన్న మధ్యాహ్న తరుణంలో ఆంజనేయుని జననం జరిగింది. మామూలు మానవుడుగా పుట్టి ఆదర్శ తనయునిగా, ఆదర్శ మిత్రుడుగా, ఆదర్శ ప్రభువుగా, ఆదర్శ పరిపూర్ణ ధర్మమూర్తిగా, ఆదర్శ వ్యక్తిగా………పలు ఉత్తమోత్తమ గుణములతో జీవనం సాగించిన అవతారమూర్తి శ్రీరాముడు కాగా, తాను నమ్మిన దైవమును త్రికరణశుద్ధిగా సేవిస్తూ, రామున్ని అపారభక్తితో ఆరాదిస్తూ, రామనామమహిమను రామునికే తెలియజెప్పే పరమభక్తునిగా, త్రేతాయుగమున రామబంటై, ద్వాపరమున తన ప్రకీర్తితో రామభక్తుడై ఫరిడిల్లి, కలియుగమున రామభక్తులకు బాంధవుడై, మహిమాన్విత దైవమై, ఊరూరా వాడవాడన, ఇంటింటా, గుండె గుండెలో కొలువై యుగయుగాలుగా చిరంజీవిగా విరాజిల్లుతున్న భక్తజ్ఞానప్రపూర్ణ దివ్యమూర్తి ‘ఆంజనేయుడు’. సేవ, భక్తి, దౌత్యం, నీతి, దైర్యం, అభయం అనే షడ్గుణములకు ప్రతీక ఆంజనేయుడు. ఆత్మబలంనందు, మతియందు, గతియందు హనుమంతుడికి ధీటి, సాటి మరొకరు లేరు. ఆర్తులను రక్షిస్తూ, ఆంజనేయా అని తలచిన అందరినీ ప్రజ్ఞా దైర్యవంతులను చేస్తూ, తనని స్మరించినంతమాత్రమునే భూత ప్రేత పిశాచాలను దరిచేరనివ్వక అభయమొసగే ఆపద్భాందవుడు ఆంజనేయుడు. ‘దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే’. ఈ జగత్తులో కష్టమైనా పనులేమైనా ఉంటే ఆంజనేయుడి అనుగ్రహంతో అవి నెరవేరుతాయి. పుట్టిన కొద్దిరోజులనాడే బాలాంజనేయుడు సూర్యున్ని గాంచి పండుగా భావించి సూర్యుని మింగుటకు వాయువేగంతో సూర్యమండలంలో ప్రవేశించగా, ఆనాడు సూర్యగ్రహణం అవటంచే సూర్యున్ని పట్టుటకు వస్తున్న రాహువుని మరొకపండుగా భావించి రాహువున్ని ఆంజనేయుడు పట్టబోగా అతను తప్పించుకొని పారిపోయి ఇంద్రుణ్ణి శరణుకోరాడు. అప్పుడు ఇంద్రుడు ఐరావతంపై రాగా, ఐరావతమును మరొక పండుగా తలచి పట్టుకోగా ఇంద్రుడు వజ్రాయుధంను ప్రయోగించడంతో వాయుసుతుని వామహనువుకు (ఎడమ దవడకు) గాయమై కుప్పకూలిపోతుండగా వాయుదేవుడు పదిలంగా పట్టుకొని ఓ గుహలోనికి తీసుకుపోయి బాధతో ఆగ్రహించి తనవాయుప్రసారగతిని నిరోధించాడు. వాయుస్తంభనతో జీవుల ఉచ్ఛ్వాస నిశ్వాసములకు తీవ్రవిఘాతం కలుగగా, ముల్లోకాలు తల్లడిల్లగా దేవతలందరూ బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఆ బాలుడు సామాన్యుడు కాదు, దేవతాకార్యసిద్ధి నిమిత్తం రుద్రుడే అంజనా గర్భమున అవతరించాడు, మీరు దండించినది సాక్షాత్తు రుద్రుడునేనని చెప్తూ భూలోకమున వాయుదేవుడున్ గుహలోనికి ఇంద్రాదిదేవతలతో కల్సివచ్చి వాయునందనుడును తాకి స్వస్థుడిని చేసాకా, అందరూ వరాలు ప్రసాదించిన పిమ్మట ఆంజనేయుడు హనుమ అనే నామంతో ప్రసిద్ధుడవుతాడని ఆశ్వీరదించిరి. ఈ ఘటనలో కూడా ఓ అంతరార్ధం ఉంది. ఎర్రని సూర్యుడిని పండు అనుకోని మ్రింగబోయాడు. అటుపై సూర్యగ్రహణమవటం వల్ల నల్లగా ఉండే రాహువు రాగా అతనినీ మింగబోయాడు. ఆ తర్వాత తెల్లగా ఉండే ఐరావతంను చూసి దానిని మింగబోయాడు. పై సంఘటనను కాస్తా పరిశీలిస్తే ఎరుపు రజోగుణమునకు సంకేతం కాగా, నలుపు తమస్సు అంటే తమోగుణంనకు, తెలుపు సాత్త్విక గుణంనకు సంకేతాలు. ఈ మూడింటిని మింగబోయడంటే రజస్తమోసత్త్వగుణములకు ఆంజనేయుడు అతీతుడు కాబోయడని అర్ధం. అంటే పుట్టుకుతోనే ఆంజనేయుడు త్రిగుణములకు అతీతుడు. ఈ హనుమ అన్న దివ్యనామం ఎంతో మహిమాన్వితమైనది. హ :- హకారం శివ బీజంచ, శుద్ధస్ఫటిక సన్నిభం అణిమాద్యష్ట సిద్ధించ, భుక్తిముక్తి ప్రదాయకం. {హకారం ఈశ్వరబీజం. శుద్ధస్ఫటికంలా తెల్లని కాంతిగల ఈశ్వరత్వానికి ప్రతీక. ఈ బీజోచ్చారణ వలన అణిమాద్యష్టసిద్ధులు లభిస్తాయి. భుక్తి ముక్తిలను ప్రసాదిస్తుంది} ను :- నుకారం చైవ సావిత్రం, స్ఫటికం జ్ఞాన సిద్ధిదం వాయువేగం మనోవేగం, స్వేచ్ఛారూపం భవేద్రువనమామిా
విత్రి లేక సవిత అంటే సూర్యునికి సంకేతం. సూర్యుని అనుగ్రహం కలిగించే స్పటికంవంటి కాంతిగల ఈ బీజోచ్చారణ వాయు,మనోవేగాలను స్వేచ్ఛారూపాన్ని, జ్ఞానసిద్ధిని కలుగజేస్తుంది} మ :- మకారం మధనంజ్ఞేయం, శ్యామం సర్వఫలప్రదం కాలరుద్రమితిఖ్యాతం, ఉమాబీజంభయప్రదం. {మకారం మనస్సును మధించే శక్తి కలది. కాలరుద్రమని పిలవబడే ఈ బీజం, ఉమాబీజం, శివశక్తులకు సంకేతం. శ్యామవర్ణంగల ఈ ‘మ’ బీజం స్థిరమైన మనస్సును, సమస్త కోరికలను తీర్చును} శివ, సూర్య, శక్తి బీజాలతో కూడుకున్న ఈ ‘హనుమ’ అనే నామోచ్చారణచే జ్ఞానం, బుద్ధి, యశస్సు, ధైర్యం, అభయం, పూర్ణాయువు, ఆరోగ్యం, కార్యసిద్ధి, వాక్ఫటిమ ప్రాప్తించును. తన ప్రభువైన సుగ్రీవునకు, అవతారమూర్తులైన సీతారాములకు హితాన్ని కూర్చిన మహామహిమోపేతుడు హనుమంతుడు. శ్రీరామచంద్రుడు విజయానంతరం హనుమంతునితో – ‘ఏకైకస్యోపకారాయ ప్రాణాన్ దాస్యామి హే కపే, ప్రత్యహం క్రియమాణేన శేషస్యఋణినావయమ్’. హనుమా! నీవు చేసిన ఒక్కొక్క ఉపకారమునకు నేను ప్రాణార్పణం చేసి ఋణమున తీర్చుకొనువాడును. నిస్వార్ధంగా నీవు చేసిన సేవల ఋణమును నేనెట్లు తీర్చుకొనగలను? సదా నీకు ఋణపడియే యుందును. ఉపకారేణ సుగ్రీవః రాజ్యం కాంక్షన్ విబీషణః / నిష్కారణస్త్వం హనుమన్ త్వమేవాతః ప్రమోదకః // ప్రత్యుపకారార్ధమై సుగ్రీవుడు, రాజ్యకాంక్షతో విబీషుణుడు నాకు సహకరించినారు. నీవు మాత్రం అకారణముగా నాకు సహకరించి నాకెంతయో ప్రీతిభాజనుడవైనావు. సరే, ఇందుకు బదులుగా – సర్వస్వభూతం గృష్ణీష్వ పరిష్వంగం మయాకృతం వరం దదామి పింగాక్ష సర్వకార్యపరో భవ త్వన్మంత్ర జాపినాం నిత్యం త్వన్నామస్మృతికారిణాం త్వద్రూప పూజకానాం చ సర్వకార్యపరో భవ నా సర్వస్వంగా నేను సంభావించి (సీతకు మాత్రమే ఇచ్చిన) నా కౌగిలిని నీకు ఇచ్చుచున్నాను. అంతేకాదు, నీకు కొన్ని వరములు కూడా ఇస్తున్నాను. నీ నామాన్ని జపించేవారికి, నిను సదా స్మరించేవారికి, నీ రూపాన్ని అర్చించేవారికి నీవు సర్వకార్యసిద్ధిప్రదుడవు అవుతావు. మత్కధావేక్షితా యావత్ యావత్ పర్వతసంస్థితి: యావచ్చంద్రశ్చసూర్యశ్చ తావత్వం సుఖితోభవ పశ్చాత్ చతుర్ముఖో భూత్వ సృష్ట్యా లోకాన్ యధావిధి త్రిలోకవాసిభిస్స్వార్ధం మత్స్వరూపము పైష్యసి లోకములో రామకధ ఉన్నంతవరకు, పర్వతాలు సూర్యచంద్రులు ఉన్నంతవరకు నీవు చిరంజీవిగా యుండి, తర్వాత కల్పంలో భవిష్యద్బ్రహ్మవై లోకాలను సృష్టించి, పాలించి ఆ కల్పాంతంలో నా సాయుజ్య ముక్తిని పొందుతావు. ఇత్యాది రామానుగ్రహ వరములను పొందిన మహిమాన్వితుడు శ్రీ ఆంజనేయుడు. శ్రీ ఆంజనేయం శిరసా నమామి