10 హనుమాన్ అంటే!
హనుమాన్ అంటే!
హైందవులకు పరమ పూజనీయుడు హనుమంతుడు. కలియుగం ఉన్నంతవరకూ చిరంజీవిగా నిలుస్తూ, భక్తుల కష్టాలను తీరుస్తూ ఉంటాడని నమ్మకం. ఇంతకీ హనుమంతుడు అని పదే పదే తల్చుకునే ఆ పేరు వెనుక మర్మం ఏమిటో…
వాయుదేవుని ద్వారా శివుని తేజం అంజనాదేవి అనే వానరకాంతకు చేరింది. అలా జన్మించినవాడు అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి, కేసరీనందనుడు అన్న పేరు కూడా లేకపోలేదు. ఇక ఆంజనేయుడు బాల్యం నుంచీ చిలిపివాడే. అసలే, నిమిషమైనా కుదురుగా ఉండలేని వానరజీవి. దానికి తోడు శివుని తేజము, వాయుదేవుని అంశ, కేసరి శక్తి ఉండనే ఉన్నాయి. దాంతో ఆయనను పట్టడం సాధ్యమయ్యేది కాదు.
ఒకసారి ఆంజనేయుడు ఆకాశంలో సంచరిస్తుండగా ఎర్రటి సూర్యబింబం కనిపించింది. ఎర్రగా, గుండ్రంగా, తళతళలాడిపోతూ ఉన్న బింబాన్ని చూసి అదేదో పండు అని భ్రమించాడు ఆంజనీపుత్రుడు. చూసిందే తడవుగా ఆ పండుని రుచి చూడాల్సిందే అని తీర్మానించుకున్నాడు. అంతే! వాయువేగంతో సూర్యుని వైపు దూసుకుపోయాడు. వాయుదేవునికి తన కుమారుని బాల్యచేష్టను చూసి ముచ్చట వేసిందే కానీ, అందులో ఉన్న ప్రమాదం గోచరించలేదు. అందుకనే ఆంజనేయుని చుట్టూ చల్లటి గాలులను వీస్తూ, అతనికి వేడి తగలకుండా కాచుకున్నాడు. పైగా ఆ రోజు సూర్యగ్రహణం. దాంతో సూర్యుని తీక్షణత సైతం తక్కువగా ఉంది.
ఒకవైపు నుంచి హనుమంతుడు సూర్యుని వైపు దూసుకుపోతుంటే, మరోవైపు నుంచీ సూర్యుని చెరపట్టేందుకు రాహువు పొంచుకు రాసాగాడు. కానీ హనుమంతుని చూసిన రాహువుకి మతిపోయింది. తాను సూర్యుని భక్షించేలోపే మరో రాహువు అందుకు సిద్ధపడటం ఏమిటి? అని కంగారుపడిపోయాడు. వెంటనే వెనుతిరిగి ఇంద్రలోకం వైపు పరుగులు తీశాడు. ‘స్వామీ ఇవాళ నేను సూర్యుని గ్రహించడం సాధ్యమయ్యేట్లు లేదు! మరో జీవి ఏదో సూర్యుని భక్షించేందుకు దూసుకువస్తోంది’ అంటూ మొరపెట్టుకున్నాడు.
రాహువు మాటలు విన్న ఇంద్రునికి పట్టరాని కోపం వచ్చింది. సృష్టిధర్మానికి విరుద్ధంగా, పంచభూతాలను సైతం తోసిరాజని ముంచుకొస్తున్న ఆ ప్రమాదాన్ని స్వయంగా ఎదుర్కోవాలనుకున్నాడు. వెంటనే తన వజ్రాయుధాన్ని చేతబూని, ఐరావతాన్ని అధిరోహించి ఆంజనేయుని ఎదుర్కొనేందుకు బయల్దేరాడు. కానీ ఇంద్రుని చూసి ఆగేవాడా ఆంజనేయుడు. పైగా ఆయన ఎక్కిన ఐరావతం కూడా ఒక మిఠాయిలాగానే కనిపించింది. వెంటనే దాన్ని అందుకోబోయాడు. ఇక ఇంద్రుని ఆగ్రహానికి హద్దులు లేకపోయాయి. అమితశక్తిమంతమైన తన వజ్రాయుధాన్ని ఆయన మీదకు విడిచాడు.
ఇంద్రుని వజ్రాయుధానికి తిరుగేముంది! అది నేరుగా ఆంజనేయుని దవడకు తగిలింది. ఆ దెబ్బతో ఆంజనేయుడు మూర్ఛిల్లాడు. కుమారుడి అవస్థ చూసిన వాయుదేవునికి చెప్పలేనంత ఆగ్రహం కలిగింది. వెంటనే ముల్లోకాల నుంచీ తన పవనాలను ఉపసంహరించుకున్నాడు. వాయువు లేక ప్రపంచం తల్లడిల్లిపోయింది. ఈ కల్లోలానికి కలవరపడి దేవతలంతా ఆంజనేయుని చెంతకు చేరుకున్నారు. బ్రహ్మ చేతి స్వర్శ తగలగానే ఆంజనేయుడు తిరిగి కోలుకున్నాడు. అదిగో అప్పటి నుంచీ ఆంజనేయుడు, హనుమంతుడు అన్న పేరుని సాధించాడు. ‘హను’ (దవడ) దెబ్బతిన్నది కనుక హనుమంతుడు అయ్యాడు. హనుమంతుడు అన్న పేరుకి కొందరు సర్వోన్నతుడనీ, మగ వానరుడు అనీ చెబుతారు కానీ… ఎక్కువ మంది అంగీకరించిన అర్థం మాత్రం- గాయపడిన దవడ కలిగినవాడు అనే!
ఆంజనేయుడు ఈ ఉపద్రవం నుంచి తేరుకోగానే అతనికి ఆశీర్వాదసూచకంగా దేవతలంతా తలా ఒక వరాన్నీ అందించారు. ఇకపై తన వల్ల మృత్యువు సంభవించదని యముడు ఆశీర్వదించాడు కాబట్టి ఆంజనేయుడు ‘చిరంజీవి’గా మారాడు. ఇంద్రుడు ఇకపై తన వజ్రాయుధం హనుమంతుని గాయపరచదు అన్న అభయాన్ని అందించాడు. అలాగే బ్రహ్మ కూడా తన బ్రహ్మాస్త్రం ఆంజనేయుని ఏమీ చేయజాలదన్న వరాన్ని అందించాడు. అలా అంజనేయుని సూర్యగ్రహణ ఘట్టం సుఖాంతమైంది. హనుమంతుడు అన్న పేరు మాత్రం శాశ్వతంగా నిలిచిపోయింది.
#భీముడు_ఆంజనేయుని_కలుసుకొనుట
ఒకరోజు ద్రౌపది భీముడు గంధమాధన పర్వతచరియలలో విహరిస్తున్నారు. వారి ముందు సహస్రదళ పద్మం గాలిలో ఎగురుతూ వచ్చి పడింది. దానిని చూసి ద్రౌపది ముచ్చట పడింది. అలాంటి పద్మాలు మరికొన్ని కావాలని భీముని కోరింది. ద్రౌపది కోరిన సౌగంధికా పుష్పాలు తెచ్చేందుకు బయలుదేరాడు. అలా వెళుతూ భీముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు. ఈ శబ్ధాలను అక్కడ ఉన్న హనుమంతుడు విన్నాడు. ఆ వచ్చినది తన సోదరుడు భీముడని గ్రహించాడు. గుహలో నుండి బయటకు వచ్చి అక్కడ ఉన్న చెట్లను పెరికి దారికి అడ్డం వేసాడు. తాను కూడా దారికి అడ్డంగా పడుకుని తోకను విలాసంగా ఆడించసాగాడు. భీముడు అక్కడికి వచ్చి హనుమంతుని చూసి సింహనాదం చేసాడు. ఆ శబ్ధానికి హనుమంతుడు కళ్ళు తెరిచి ” ఎవరయ్యా నీవు? పెద్దవాడిని, అలసిపోయి పడుకున్న వాడిని పడుకుని ఉంటే ఇలా అరవడం తగునా? అడవిలో ఉన్న పండ్లు ఫలాలు తిని వెళ్ళు ఇలా అరవకు ” అన్నాడు హనుమంతుడు. భీముడు ” నేను పాండురాజు పుత్రుడను, ధర్మరాజూ తమ్ముడిని. నా నామధేయం భీమసేనుడు. నేను కార్యార్ధినై వెళుతున్నాను. నాకు దారి వదులు ” అన్నాడు. హనుమంతుడు ” నేను ముసలి వాడిని కదలలేను. నీవే నా తోకను పక్కన పెట్టి నీ దారిన నీవు వెళ్ళచ్చు ” అన్నాడు హనుమంతుడు. భీముడు అదెంత పని అని తోకను ఒక్క చేత్తో ఎత్తి పెట్టబోయాడు. తోక కదల లేదు.రెండు చేతులు ఎత్తి పట్టుకుని ఎత్తబోయాడు. అప్పుడూ కదల లేదు. భీముడు అది చూసి ఆశ్చర్య పోయాడు.భీముడు హనుమంతునితో ” అయ్యా! మీరెవరో నాకు తెలియదు. కాని మీరు మహాత్ములు. నన్ను మన్నించండి ” అన్నాడు. హనుమంతుడు భీమునితో ” భీమా! నేను హనుమంతుడిని, నీ అన్నను వాయు పుత్రుడను. నేను రామబంటును. రావాణుడు రాముని భార్యను అపహరించగా నేను లంకకు వెళ్ళి సీతమ్మ జాడను తెలుసుకుని రామునికి తెలిపాను. రాముడు రావణుని సంహరించి సీతమ్మను పరిగ్రహించాడు. రాముడు నా సేవలకు మెచ్చి నన్ను చిరంజీవిగా ఉండమని దీవించాడు ” అప్పటి నుండి నేను గంధమాధన పర్వతంపై నివసిస్తున్నాను ” అని చెప్పాడు. అది విన్న భీముడు సంతోషించి ” ఆంజనేయా! నీవు అలనాడు సముద్రాన్ని లంఘించిన రూపాన్ని చూడాలని కోరికగా ఉంది. ఒక్క సారి చూపించవా? ” అని అడిగాడు. హనుమంతుడు ” భీమా! అది ఎలా కుదురుతుంది. ఆ కాలం వేరు ఈ కాలం వేరు యుగధర్మాలు కృతయుగంలో ఒకలా , త్రేతాయుగంలో వేరేలా, ద్వాపరంలో మరోలా ఉంటుంది. అలాగే కలియుగంలో పూర్తి విరుద్ధంగా ఉండబోతుంది ” అన్నాడు.
#హనుమంతుడు_చెప్పిన_యుగధర్మాలు
భీముడు ” అన్నయ్యా! ఆయా యుగాలలోని ఆచారాల గురించి చెప్పవా? ” అన్నాడు. హనుమంతుడు ఇలా చెప్పసాగాడు ” భీమసేనా! కృతయుగంలో అన్నీ కృతములే కాని చెయ్యవలసినది ఏమీ లేదు. అందుకనే ధర్మం నాలుగు పాదాలతో నడిచింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు శుక్లవర్ణంతో ప్రజలను కాపాడాడు. సనాతన ధర్మం వర్ధిల్లింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వేదాలు తమకు విధించిన విధులు నిర్వర్తించారు. వారు కోరకుండానే తగిన ఫలితాలు కలిగాయి. కనుక వారు పుణ్యలోకాలకు పొందారు. ఆ యుగంలో జనులకు అసూయ, ద్వేషము, గర్వము, మదము, మాత్సర్యము, కోపము, భయం, సంతాపం, ప్రజాక్షయం, అవయవక్షయం లాంటివి లేవు. తరువాత త్రేతాయుగం ఆరంభమైంది. ధర్మం మూడుపాదాలతో నడిచింది. ఆ రోజుల్లో ప్రజలు సత్యసంధులు, యజ్ఞయాగాదులు చేసే వారు, తపస్సులు చేసే వారు, దానాలు చేసేవారు. అప్పుడు విష్ణువు రక్తవర్ణంతో ప్రజలను రక్షించాడు. ద్వాపరయుగం వచ్చింది. ధర్మం రెండు పాదాలతో నడిచింది. వేదములు, శాస్త్రములు విధించిన ధర్మము కామము అనుసరించబడ్డాయి. కాని ద్వాపరయుగంలో ప్రజలు మాటమీద నిలవరు, సత్యము శమము హీనమౌతుంది. ప్రజలు కామ్యార్ధం మాత్రమే యజ్ఞాలు చేస్తారు. ఈ యుగంలో విష్ణువు కృష్ణవర్ణంతో ప్రజా రక్షణ చేస్తాడు. తరువాత వచ్చునది కలియుగం . ఈ యుగంలో ధర్మం ఒక పాదంతో నడుస్తుంది. విష్ణువు పసుపు పచ్చని వర్ణంతో లాలాలను రక్షిస్తాడు. కలియుగంలో జనులు తమోగుణంతో ప్రవర్తిస్తారు. జనులు కామము, క్రోధము మొదలైన వాటికి వశులై అధర్మ వర్తనుడై ప్రవర్తిస్తారు. కలియుగంలో తపస్సు, ధర్మము, దానము లాంటి పుణ్యకార్యాలు స్వల్పంగా ఆచరించబడతాయి. కాని వాటికి ఫలితం విశేషంగా ఉంటాయి ” అని హనుమంతుడు చెప్పాడు. భీముడు ” ఆంజనేయా ! అలనాడు నీవు సాగరం దాటిన భీమరూపాన్ని చూడకుండా నేను ఇక్కడ నుండి కదలను ” అన్నాడు.
#హనుమంతుడి_బృహద్రూపం
ఆంజనేయుడు సాగరాన్ని దాటినప్పటి రూపాన్ని భీమునకు చూపాడు. రెండవ మేరు పర్వతమా అని భ్రమింప చేసే ఆంజనేయుని విరాట్రూపం చూసి భీముడు భీతి చెంది ఆ రూపాన్ని ఉపసంహరింపమని హనుమంతుని వేడుకున్నాడు. హనుమంతుడు రూపాన్ని ఉపసంహరించి ” భీమసేనా! నీవు కావాలి అనుకున్న సౌగంధికా పుష్పములు ఉన్న కొలనును యక్షుల, గంధర్వులు సంరక్షిస్తుంటారు. అక్కడ నీ శౌర్యప్రతాపాలు పనికి రావు. ఆ పుష్పాలు దేవతలు అనుభవిస్తుంటారు. దేవతలు భక్తికి లొంగుతారు కనుక ధర్మమెరిగి ప్రవర్తించు. సదాచారం నుండి ధర్మం పుడుతుంది. ధర్మం వలన వేదం ప్రతిష్టించ బడుతుంది. వేదముల వలన యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాలవలన దేవతలు సంతృప్తి చెందుతారు. దేవతల తృప్తి చెందితే సకాల వర్షాలు పడి సంపదలు వృద్ధి చెందుతాయి. ఆలోచించి నిర్ణయించుకో. పిల్లలతో, గర్వం కలవారితో, నీచులతో వ్యర్ధ ప్రసంగం చెయ్యవద్దు. నున్ను చూస్తే సంతోషం కలుగుతుంది. నీకేమి కావాలో అడుగు. భీమా! నీకు, నీ వారికి అపకారం చేసిన కౌరవులు, దృతరాష్ట్రుడు మొదలైన వారిని సంహరించి హస్థినా పురం నేల మట్టం చెయ్యమంటావా ? ” అన్నాడు. భీముడు ” అమిత బలశాలివి అయిన నూకు అది అసాధ్యంకాదు. కాని మా శత్రువులను మేమే జయించడం ధర్మం కదా ” అన్నాడు. హనుమంతుడు ” భీమా! యుద్ధభూమిలో నన్ను తలచిన ఎడల నేను అర్జునిని రథం మీద ఉన్న ధ్వజంపై ఉండి మీకు విజయం కలగడంలో సహకరిస్తాను. అలాగే మీ ధైర్య సాహసాలు ప్రత్యక్షంగా చూస్తాను ” అన్నాడు. తరువాత హనుమంతుడు భీమునకు సౌగంధికా సరోవరానికి మార్గం చూపి వెళ్ళి పోయాడు.
#భీముడు_సౌగంధికా_పుష్పములు_తెచ్చుట
హనుమంతుడు చూపిన మార్గంలో ప్రయాణించి భీముడు కుబేరుని వనంలో ఉన్న సౌగంధికా పుష్పముల తోటను చేరాడు. భీముని వనరక్షకులైన రాక్షసులు అడ్డగించారు.వారు భీమునితో ” అయ్యా ఇది కుబేరుని తోట కుబేరుడు ఇందులో విహరిస్తున్నాడు. ఇక్కడ ఉండటం ప్రమాదం ” అని హెచ్చరించారు. భీముడు ” నేను పాండు రాజు కుమారుడిని. నాపేరు భీమసేనుడు. నా భార్య ద్రౌపది ఈ సౌగంధికా పుష్పములు కావాలని కోరింది. వీట్ని తీసుకు పోవడానికి వచ్చాను ” అన్నాడు. వనరక్షకులు భీమునితో ” అయ్యా! నూవు ధర్మరాజు సోదరుడివి ధర్మం తెలిసి నడచుకో. నీవు కుబేరుని అడిగి ఈ పుష్పములను తీసుకు పో ” అన్నారు. భీముడు ” ప్రకృతి స్సిద్దమైన ఈ కొలను కుబేరునికి మాత్రమే స్వంతం కాదు అందరిది. నేను క్షత్రియుడను, ఎవ్వరినీ యాచించను, నా భుజ బలంతో తీసుకువెళతాను ” అని చెప్పి కొలనులో దిగి పుష్పములు కోయసాగాడు. వనరక్షకులు భీమునితో యుద్ధానికి దిగారు. భీముడు వారినందరిని జయించాడు.వారు కుబేరునితో ఈ విషయం చెప్పారు. కుబేరుడు భీముని పరాక్రమం గురించి విని ఉన్నాడు కనుక ఉదారంగా విడిచి పెట్టాడు. భీముడు సౌగంధికా పుష్పాలతో తిరిగి వెళుతున్న సమయంలో ధర్మరాజు నకులసహదేవులు, ద్రౌపదితో కలసి భీమునికి ఎదురు వచ్చాడు. భీముడు ద్రౌపదికి సౌగంధికా పుష్పాలను ఇచ్చాడు. ఇంతలో కొంత మంది యక్షులు వారి వద్దకు వచ్చి ” అయ్యా! ఈ ప్రదేశంలో యక్షులు రాక్షసులు తిరుగుతుంటారు. ఇక్కడ ఉండటం సురక్షితం కాదు ” అని చెప్పారు. అందుకు అంగీకరించి ధర్మరాజాదులు అక్కడి నుండి కొంతదూరం వెళ్ళి నివాసం ఏర్పరచుకున్నారు.
#జటాసురుడు
ఒకరోజు జటాసురుడు అనే రాక్షసుడు బ్రాహ్మణ వేషంలో వారి దగ్గరకు వచ్చారు. అతడు పాండవులతో ” నేను వేదాలను చదువుకున్నాను పరశురాముని శిష్యుడను ” అని చెప్పి వారి నివాసంలో ఉంటూ వారితో పాటు తింటూ ఉంటూ ఉన్నాడు. ఒక రోజు భీముడు వేటకు వెళ్ళాడు. జటాసురుడు ఇదే అదనుగా భావించి తన నిజరూపం ధరించాడు. ధర్మరాజూ, ద్రౌపదిని, నకులసహదేవులను తీసుకుని ఆకాశమార్గంలో పరుగెత్తసాగాడు. అక్కడ ఉన్న బ్రాహ్మణులు అది చూసి భీతి చెందారు. నకులుడు రాక్షసునితో ” అయ్యా! ఇప్పటి వరకు మా ఇంట భుజించి మాకు అపకారం తలపెట్టడం భావ్యమా? ” అని అడిగాడు. ఆ రాక్షసుడు బదులు చెప్పలేదు. ” అయితే నాతో యుద్ధం చెయ్యి ” అని నకులుడు అన్నాడు. ఇంతలో విప్రుల వలన విషయం తెలుసుకున్న భీముడు వాయు వేగంతో అక్కడికి వచ్చాడు. భీముడు రాక్షసునితో ” మర్యాదగా ధర్మరాజును, ద్రౌపదిని, నకులసహదేవులను విడిచి పెట్టు లేకుంటే బకాసురుడు, హిడింబుడు చచ్చినట్లు చస్తావు ” అని హెచ్చరించాడు. జటాసురుడు ” ఓయి భీమా! నిన్ను యుద్ధంలో చంపి బకాసురునికి, హిడింబునకు, కిమ్మీరునకు రక్త తర్పణం చేస్తాను ” అని భీమునితో యుద్ధానికి దిగాడు. ఇద్దర్కి మధ్య ఘోరంగా యుద్ధం జరిగింది. జటాసురుడు అలసిపోవడం గ్రహించిన భీముడు అదనుగా తీసుకుని జటాసురుని పై విజృంభించి అతనిని వధించాడు. రోమశుడు, ధౌమ్యుడు, ధర్మరాజు భీముని శౌర్యం చూసి ప్రశంసించారు.