ఆంజనేయునికి తమలపాకుల మాల ఎందుకు? Anjaneyuniki Thamalapakula Maala Anduku ?

By | July 10, 2017

8. ఆంజనేయునికి తమలపాకుల మాల ఎందుకు?

ఆంజనేయునికి తమలపాకుల మాల ఎందుకు?

 

సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు. రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. రామునికి అన్వేషణలో సాయడపడుతోన్న ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు. అతడు వెళ్లేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది. అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు. దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి, ఆంజనేయుని తలమీద పెట్టి దీవిస్తుంది. అందుకే ఆంజనేయుని తమలపాకు ప్రీతిపాత్రమైనది.

అది మాత్రమే కాదు. సీతమ్మ వద్దనుంచి తిరిగి వెళ్తూ… ఆకాశంలో పయనిస్తూ… గట్టిగా హూంకరిస్తాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు విషయం అర్థమైపోతుంది. ఆంజనేయుడు కచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా వేయి కళ్లతో ఆంజనేయుడి కోసం ఎదురు చూస్తారు. అతడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు. అందువల్లే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కుమ్మరిస్తాడని అంటారు.

హనుమంతుడు జ్యోతి స్వరూపుడు. ఆయన్ని పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి. అవరోధాలు తొలగిపోతాయి. అందుకే ప్రతి మంగళ, శనివారాల్లో హనుమంతునికి ప్రపంచ వ్యాప్తంగా పూజలు జరుగుతాయి. పూజలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలను సమర్పిస్తే మనోభీష్టాలు నెరవేరతాయి. అది మాత్రమే కాక హనుమాన్ చాలీసాను సైతం పారాయణం చేస్తే సర్వసంపదలూ సుఖసంతోషాలూ వెతుక్కుంటూ వస్తాయి.