పన్నెండవ అధ్యాయం – భక్తియోగం

By | July 6, 2016

శ్రీమద్భగవద్గీత

పన్నెండవ అధ్యాయం –  భక్తియోగం

అర్జున ఉవాచ

ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే |
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః || 1

అర్జునుడు: ఇలా నిరంతరం మనస్సు నీ మీదే నిలిపి నిన్ను భజించే భక్తులు ఉత్తములా ? ఇంద్రియాలకు గోచరించని ఆత్మ స్వరూపాన్ని ఆరాధించే వాళ్ళు ఉత్తములా?

శ్రీ భగవానువాచ

మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే |
శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః || 2

శ్రీ భగవానుడు: నా మీదే మనసు నిలిపి నిత్యనిష్ఠతో, పరమ శ్రద్ధతో నన్ను ఉపాసించే వాళ్ళే ఉత్తమయోగులని నా ఉద్దేశం.

యే త్వక్షరమనిర్దేశ్యమ్ అవ్యక్తం పర్యుపాసతే |
సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువమ్ || 3

సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః |
తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః || 4

ఇంద్రియాలన్నింటినీ బాగా వశపరచుకుని, సర్వత్రా సమభావం కలిగి, సమస్త భూతాలకూ మేలు చేయడంలోనే సంతోషం పొందుతూ నాశరహితమూ అనిర్వచనీయమూ అవ్యక్తమూ సర్వవ్యాప్తమూ ఊహాతీతమూ నిర్వికారమూ నిశ్చలమూ నిత్యమూ అయిన ఆత్మ స్వరూపాన్ని ఉపాసించేవాళ్ళు నన్నే పొందుతారు.

క్లేశో௨ధికతరస్తేషామ్ అవ్యక్తాసక్తచేతసామ్ |
అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే || 5

ఆవ్యక్తమైన ఆత్మ స్వరూపాన్ని ఆదరించేవాళ్ళ శ్రమ ఎంతో ఎక్కువ. ఎందువలనంటే శరీరం మీద అభిమానం కలవాళ్ళకు అవ్యక్త బ్రహ్మం మీద నిష్ఠ కుదరటం కష్టసాధ్యం.

యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః |
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే || 6

తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ |
భవామి నచిరాత్ పార్థ మయ్యావేశితచేతసామ్ || 7

పార్థా ! సమస్త కర్మలూ నాకే సమర్పించి నన్నే పరమగతిగా భావించి ఏకాగ్రతతో నన్ను ధ్యానిస్తూ సేవించే నా భక్తులను, మనసు నా మీదే నిలిపే వాళ్ళను మృత్యుముఖమైన సంసారసాగరం నుంచి అచిరకాలంలోనే నేను ఉద్ధరిస్తాను.

మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ |
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః || 8

నా మీదే మనసును బుద్ధిని నిలుపు. ఆ తరువాత తప్పకుండా నీవు నాలోనే నివసిస్తావు.

అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ |
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ || 9

ధనంజయా ! అలా మనసు నామీద నిశ్చలంగా నీవు నిలపలేక పోతే అభ్యాసయోగంతో నన్ను పొందడానికి ప్రయత్నించు.

అభ్యాసే௨ప్యసమర్థో௨సి మత్కర్మపరమో భవ |
మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి || 10

అభ్యాసం చేయడంలోనూ అసమర్థుడవైతే నా కోసం కర్మలు ఆచరించు. నాకు ప్రీతి కలిగించే కర్మలు చేయడం వల్ల కూడా నీవు మోక్షం పొందగల్గుతావు.

అథైతదప్యశక్తో௨సి కర్తుం మద్యోగమాశ్రితః |
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ || 11

ఇక అదీ చేయలేకపోతే నన్ను ఆశ్రయించి మనోనిగ్రహంతో నీవు చేసే సమస్త కర్మల ఫలాలూ త్యగం చేయి.

శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే |
ధ్యానాత్‌కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరమ్ || 12

అవివేకంతో కూడిన అభ్యాసం కంటే జ్ఞానం మేలు; జ్ఞానం కంటే ధ్యానం ఉత్తమం; ధ్యానం కంటే కర్మఫలత్యాగం మంచిది. ఆ త్యాగం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ |
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ || 13

సంతుష్టస్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః |
మయ్యర్పితమనోబుద్ధిః యో మద్భక్తస్స మే ప్రియః || 14

సమస్త ప్రాణులపట్ల ద్వేషం లేకుండా స్నేహభావం, దయ కలిగి, అహంకార మమకారాలు విడిచిపెట్టి సుఖదుఃఖాలను సమానంగా చుస్తూ, ఓర్పుతో వ్యవహరిస్తూ, నిత్యం సంతృప్తితో, యోగసాధనతో, ఆత్మనిగ్రహంతో, దృఢసంకల్పంతో మనసు, బుద్ధి నాకు అర్పించిన నా భక్తుడు నాకు ఇష్టుడు.

యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః |
హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః || 15

తనవల్ల లోకమూ, లోకం వల్ల తను భయపడకుండా సంతోషం, కోపం, భయం, ఆవేశాలకు వశం కాకుండా ఉండేవాడు నాకు ఇష్టుడు.

అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః |
సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తస్స మే ప్రియః || 16

దేనిమీదా కోరికలు లేనివాడు, పవిత్రుడు, కార్యదక్షుడు, పక్షపాతం లేనివాడు, చీకుచింతా లేనివాడు, ఆడంబర కర్మలన్నింటినీ విడిచిపెట్టినవాడు అయిన నా భక్తుడు నాకు ఇష్టుడు.

యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి |
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః || 17

సంతోషం, ద్వేషం లేకుండా దుఃఖం, కోరికలు, శుభాశుభాలు విడిచిపెట్టిన నా భక్తుడంటే నాకు ఇష్టం.

సమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః |
శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సంగవివర్జితః || 18

తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ |
అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః || 19

శత్రువులపట్ల, మిత్రులపట్ల అలాగే మానావమానాలు, శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, దూషణభూషణలపట్ల సమభావం కలిగినవాడు, దేనిమీదా ఆసక్తి లేనివాడు, మౌనంగా ఉండేవాడు, ఏ కొద్దిపాటి దొరికినా సంతృప్తి చెందేవాడు, స్థిరనివాసం లేనివాడు,దృఢనిశ్చయం కలిగినవాడు అయిన నా భక్తుడు నాకు ఇష్టుడు.

యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే |
శ్రద్దధానా మత్పరమా భక్తాస్తే௨తీవ మే ప్రియాః || 20

శ్రద్ధతో నన్నే పరమ గతిగా నమ్మి అమృతం లాంటి ఈ ధర్మాన్ని నేను చెప్పినట్లు పాటించే నా భక్తులు నాకు చాలా ఇష్టులు.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని “భక్తియోగం” అనే పన్నెండవ అధ్యాయం సమాప్తం.

Related Images: