హనుమంతుడు మానవాళికి ఏకైక ఆదర్శమా? Hanumanthudu Maanavaaliki Akaika Aadarsama ?

By | July 10, 2017

5. హనుమంతుడు మానవాళికి ఏకైక ఆదర్శమా?

 

‘ధర్మ ఏవ హతో హన్తి’
ధర్మాన్ని దెబ్బతీస్తే అది మనల్ని దెబ్బతీస్తుంది. ధర్మసేవ చేయాలనుకునేవారు హనుమంతుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకంటే నిజముయిన ధర్మసేవకుడు అతడే. హనుమంతుడిని రాముని సేవకుడని చెప్పుకుంటూ ఉంటాం. అక్కడ రామశబ్దాన్ని ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అన్న దాన్ని బట్టి ధర్మంగానే స్వీకరించాలి. ధర్మ రక్షణకోసం రాముడు అవతరిస్తే అతని రూపంలో ధర్మసేవకోసం హనుమంతుడు అవతరించాడు. త్రేతాయుగంలో రావణాదులని వధించి ధర్మాన్ని రక్షించడం కోసం శ్రీరాముడు అవతరించాడు. ఆ ధర్మ కార్యం హనుమంతుడి సహకారంతోనే జరిగింది. రాముని సేవకుడైతే రాముడు పుట్టినప్పటినుండీ అతనిసేవలో హనుమంతుడు ఉండాలి. కానీ రాముడు ధర్మకార్యం ఆరంభించినప్పటినుండి మాత్రమే హనుమతుడు రాముడితో ఉన్నాడు. అందుకే రాముడికీ, హనుమంతుడికీ పరిచయం కిష్కింద కాండ దాకా జరగలేదు. అలాగే ధర్మ కార్యం ముగియగానే హనుమంతుడు గంధమాదన పర్వతంపై తపోనిష్టుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు తప్ప రామునితో రాజభోగాలు అనుభవించలేదు. ధర్మకార్యంలో తన అవసరం ఉన్నప్పుడల్లా రాముడికి తోడుగా నిలిచాడు. త్రేతాయుగంలో ధర్మస్థాపనలో కీలకపాత్రే వహించినవాడు హనుమంతుడు. రామరావణ యుద్ధం అనే ధర్మయుద్ధంలో విజయకారకుడు హనుమంతుడు.

 

ద్వాపరయుగంలో ధర్మాధర్మాలమధ్య జరిగిన యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం. అందులో ధర్మం విజయం సాధించింది. అటువంటి ద్వాపరయుగంలో ధర్మవిజయంలో కూడా హనుమంతుడిది కీలకపత్రే. కాకపొతే త్రేతాయుగంలో ధర్మ విజయానికి ప్రత్యక్షంగా కారణం కాగా ద్వాపర యుగంలో విజయానికి పరోక్షంగా కారకుడు అయ్యాడు. కురుక్షేత్ర సంగ్రామ విజయం తర్వాత ధర్మ రక్షణ భీమార్జునుల భుజస్కంధాల మీదే ఉంచబడింది. అటువంటి భీమార్జునులను ఇరువురినీ బలపరీక్ష, ధర్మ రక్షకులకు గర్వం తగదని బోధించి, అభయమిచ్చి, అండగా నిలిచి వారి విజయానికి పరోక్షంగా కారకుడు అయినవాడు హనుమంతుడు. విజయుడికి వరమిచ్చిన ప్రకారం అమ్ములవారధిని అవలీలగా పడగొట్టి కూడా ఓటమిని అంగీకరించి అర్జునుడి రథటెక్కం మీద ఉండి ధర్మ విజయ కారకుడు అయ్యాడు హనుమంతుడు.

 

సౌగంధిక కుసుమాన్ని పురుష మృగాన్ని తేవటంలో భీముడిని పరీక్షించి అనుగ్రహించి విజయం వరించాలని వరం ఇచ్చాడు. ‘కపిధ్వజప్రభల అంధీబూతులన్ జేయవే’ అని తిక్కన అన్నట్టు కౌరవసేన కళ్ళు హనుమంతుని తేజ ప్రభలతో బైర్లుకమ్మి యుద్ధం చేయటంలో ఆశక్తమయింది. హనుమంతుడు టెక్కం మీద ఉన్నందు వల్లనే శతృపక్షపు భయంకర ఆగ్నేయాస్త్రాదుల వల్ల రథం దగ్ధం కాకుండా ఉందని శ్రీకృష్ణడు అర్జునుడికి నిరూపించాడు. అలా ద్వాపరయుగంలోనూ ధర్మ విజయానికి కారకుడు హనుమంతుడు. ఇతిహాసపురాణాలు, చారిత్రిక సత్యాలు, ధర్మరక్షణలో హనుమంతుడు ఒక్కడే దిక్కు అని చెబుతున్నాయి. సకల సద్గుణ గరిష్టుడు, సర్వ శక్తిమంతుడు అయిన హనుమంతుడిని ఆదర్శంగా స్వీకరించినప్పుడే మానవజాతి ధర్మరక్షణలో కృతకృత్యం అవుతారు.

Related Images: