HANUMAN MANTRAS- హనుమాన్ మంత్రాలు /శ్లోకాలు-తెలుగు

By | July 11, 2016

Sindoora Pushpam Photo :- ఈ సిందూర పుష్పం  ఫోటో  నాకు చాల రోజుల క్రిందట  లభించినది. వివరాలు Parasara సంహితలో  ఉన్నవి. అప్పటినుండి వెతుకుతున్నాను. ప్రస్తుతం  ఈ మొక్క ఎక్కడ ఉన్నదో నాకు తెలియదు.  కానీ,  మనకు కనబడుతున్న  పుష్పం లోని  గింజలు  నూరినప్పుడు  లభించునదే  అసలైన  సిందూరం అంటారు.  ఈ సిందూరం తో స్వామివారికి  లేపనం చేయవలయును. ఇప్పుడు లభించునది అసలైన  సిందూరం కాదు.    ఐన  దొరికిన  సింధూరంతోనే  లేపనం చేయండి. కానీ  త్వరలో  స్వామివారి ద్వారా  ఈ మొక్క  మనకు లభించనుంది. త్వరలో మనమంతా ధన్యులం కాబోతున్నాము. జై భజరంగ బలి…

sindoora-pushpam

ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకమ్ !
తరుణార్క ప్రభం శాన్తం రామదూతం నమామ్యహమ్ !!

9. శంకరసువనుడు జన్మరహస్యాలు….!!

భక్తులెందరో హనుమంతున్ని ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడివడి ఉంది.

రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు తన వీర్యాన్ని స్థలనం చేశాడు. దాన్ని సప్తర్షులు సాదరంగా పొందుపరచి, గౌతముడి కూతురైన అంజనాదేవిలో చెవిద్వారా ప్రవేశపెట్టారు. ఫలితంగా శంభుడు మహాబల పరాక్రమాలగల వానరదేహంతో ఆమెకు జనించాడని (శంభుర్జజ్ఞే కపి తనుర్మహాబల పరాక్రమ:) శివమహాపురాణం (శతరుద్ర సమ్హిత 20-7) తెలిపింది. అలా హరాంశతో పుట్టిన హనుమంతుడే రుద్రావతార భగవానుడుగా శ.రు.సం. (20-14, 37) స్పష్టం చేసింది.
అంతేకాదు, హనుమంతుణ్ని శివసుతుడుగా (మహాదేవత్మజ:) కూడా శ.రు.సం (20-32) వర్ణించింది. తండ్రే తనయుడవుతాడనే (ఆత్మావై పుత్రనామాసి) సూక్తివల్ల, హనుమంతుణ్ని శివనందనుడుగా, శివావతారుడుగా కీర్తిస్తారు. శివుని పదకొండో అవతారమే హనుమంతుడని పరాశర సంహిత ధ్రువీకరించింది. త్రిపురాసుర సంహారంలో విష్ణువు పరమశివుడికి సహకరించినందుచేత రుద్రుడు కృతజ్ఞుడై హనుమంతుడిగా అవతరించి, రావణసంహారంలో విష్ణు అవతారుడైన శ్రీరాముడికి సహకరంచాడని ఈ సంహిత చెబుతోంది. ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెలగాలనేదే ఇక్కడి సందేశం. రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. ఆ శివవీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడుకి ఇస్తుంది. అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. వాయువు ఆ శివవీర్యాన్ని ఒక పండుగా మలచి, పుత్రుడికొసం తప్పస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు. ఆ పండును అంజని తిన్న పహలితంగా ఆమె గర్భం దాల్చి, కాలక్రమంలో కుమారుణ్ని ప్రసవించింది. అతడే ఆంజనేయుడు. వాయుప్రసాది కావడంచేత వాయునందనుడనే పేరు కలిగిందని ఈ సంహిత వివరించింది. భగవదనుగ్రహం వల్లనే పుత్రుడు పుట్టడు కనుక కన్యత్వ దోషం లేదని ఆకాశవాణి ధైర్యాన్నిచ్చిందంటారు.

దేవలోకంలొని పుంజికస్థల అనే శ్రేష్ఠమైన అప్సరసకాంత బృహస్పతి శాపంవల్ల భూలోకంలో వానర ప్రభువైన కుంజరుని కుమార్తెగా జన్మించింది. ఆమే అంజనాదేవి; వానరరాజైన కేసరి భార్య అయింది – వాల్మీకి రామాయణం (కిషిందకాండ 66-8). కేసరి అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినపుడు, అంజనను వాయువుకు అప్పజెప్పాడు. అంజన అందానికి ఒకసారి వాయుదేవుడు మోహితుడై, ఆమెను కౌగలించుకొన్నాడు. తాను మనస్సు చేతనే ఆమెను అనుభవించాడు కనుక, ఏకపత్నీ వ్రతం భగ్నం కాలేదని ధైర్యం చెప్పి తేజస్వి – బలశాలి – బుద్ధిమంతుడు – పరాక్రమవంతుడు అయిన పుత్రుడు పుడతాడని అంజనిని తృప్తిపరచాడు – కి.కాం (66-16, 18,19) . సంతసించిన అంజన ఒక గుహలో వైశాఖ బహుళ దశమినాడు బాలుణ్ని ప్రసవించింది. అతడే ఆంజనేయుడు. ఉదయించే సూర్యుణ్ని చూసిన ఆ బాలుడు దాన్ని తినే పండనుకొని ఆకాశంవైపు 300 యొజనాలు ఎగిరి సూర్యతేజస్సును ఆక్రమించుకొంటున్నాడు. అప్పుడు కోపగించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుణ్ని కొట్టాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడు హనువు (గడ్డం) విరిగింది. అప్పటినుంచే అతనికి హనుమంతుడనే పేరు వచ్చింది – కి.కాం. (66-24).

అలా కేసరికి క్షేత్రజ (భార్యకు ఇతరుల వల్ల పుట్టిన) పుత్రుడుగాను, వాయువుకు ఔరస (చట్ట బధ్ధమైన) పుత్రుడుగాను, శివవీర్యం వల్ల పుట్టినందుచేత శంకరసువనుడుగాను లోకప్రసిధ్ధమైన పేర్లు హనుమంతుడి జన్మ రహస్యాల్లోని పవిత్రతను వెల్లడిస్తున్నాయి. అలా హనుమంతుడి విశిష్ట జన్మ రామేశ్వరులను అనుసంధానించినట్లుగా రామేశ్వరం వద్ద భావిసేతు నిర్మాణానికి కూడా హేతువైంది.

———————————————————————

8. ఆంజనేయుడు

ఆంజనేయుడు… బ్రహ్మచారులకు ఆరాధ్య దైవం.. ఎందుకంటే ఆయన ఆజన్మ బ్రహ్మచారి కాబట్టి.. బ్రహ్మచారులకు ఆదర్శం హనుమంతుడు.. పెళ్లంటే మొహం మొత్తిన వారికి మంచి మిత్రుడు హనుమాన్‌.. అలియాస్‌ అంజి..కానీ, వీళ్లంతా అనుకుంటున్నట్లు హనుమంతుడు నిజంగా బ్రహ్మచారేనా? ఆయన పెళ్లి చేసుకోలేదా? ఒక వేళ చేసుకున్నట్లయితే.. ఆయన బ్రహ్మచారి కాడని తెలిస్తే.. ఈ బ్రహ్మచారుల గుండెలు పగిలిపోవూ.. హనుమంతుడు కఠిన నియమానికి, కఠోర బ్రహ్మచర్యానికి సింబల్‌. మరణమే లేని వరం పొందిన నవమబ్రహ్మ.. ప్రతి ఊరికీ ఆయన క్షేత్ర పాలకుడు.. అంటే కాపాడే వాడు. అలాంటి అంజి పెళ్లెప్పుడు చేసుకున్నాడు? బహ్మచర్యానికి ఆదర్శపురుషుడైన తానే బ్రహ్మచర్యానికి తిలోదకాలిస్తే.. పాపం ఆయన ఫోటో పెట్టుకుని ఘోటక బ్రహ్మచర్యం చేస్తున్న వారి గతేం కావాలి?

రామభక్త హనుమాన్‌ గురించి ఒకరికి ఒకరు చెప్పేదేముంది? పిల్లల దగ్గరి నుంచి పెద్దల దాకా హనుమంతుడంటే ఒక విశ్వాసం.. ఆంజనేయుడి ఫోటో పక్కన ఉంటే పసివాళ్లకు ధైర్యం.. పవనసుతుణ్ణి తలుచుకుంటే పెద్దలకు బలం.. అంజిని అర్చిస్తే యువతకు బుద్ధి.. ఒక వర్గానికి, ఒక జాతికి, ఒక కులానికి అని కాకుండా అన్నింటికీ అతీతంగా, అందరికీ ఆప్యాయంగా ఉండే దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే అదే ఆంజనేయుడు..
ప్రతి ఊరి ప్రారంభంలో హనుమంతుడి విగ్రహం ఉందంటే ఆ ఊరు ఆయన సంరక్షణలో ఉందని అర్థం. కాలనీ కొత్తగా వెలసిందంటే ముందుగా ఏర్పడేది హనుమంతుడి ఆలయమే..ఆ ఊరికి ఆయనే క్షేత్రపాలకుడు.. ఆ కాలనీకీ ఆయనే పాలకుడు. ఆ తరువాతే ఏదైనా.. ఇంతగా ప్రజల్లో పాపులారిటీ ఉన్న గాడ్‌ ఆంజనేయుడు..
మామూలుగా హనుమంతుడి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మొదటగా చెప్పేది ఆయన బ్రహ్మచర్యం గురించే..కానీ ఇప్పుడా బ్రహ్మచర్యానికే ముప్పు వచ్చిపడింది.. భావి బ్రహ్మ అయిన ఆంజనేయుడి బ్రహ్మచర్య దీక్షను సువర్చలా దేవి అనే సూర్యుని కుమార్తె భగ్నం చేసిందిట..
అంతటి కఠోర దీక్షలో ఉన్న హనుమంతుడు సువర్చలాదేవిని వివాహం చేసుకోవటం నిజమేనా అన్న ఆశ్చర్యం కలగకపోదు.. నిజానికి ఆంజనేయుడి పాత్ర ప్రధానంగా మనకు కనిపించే రామాయణంలో ఈ పెళ్లి తంతు లేదు.. మరి ఆ రామాయణాన్ని రాసిన వాల్మీకికి హనుమంతుడికి పెళ్లయిన సంగతి తెలుసో లేదో తెలియదు కానీ, అందులో పవన సుతుడి పాత్ర అంతా రాముడికి సేవ చేయటంతోనే సరిపోయింది..
రామాయణంలో తీవ్రమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించిన మన ఆంజనేయుడికి పరాశర సంహిత వంటి కొన్ని పురాణాలు హనుమంతుడిపై ప్రేమ పడి పెళ్లి చేసేశాయి. అలా పెళ్లి చేస్తే వచ్చిన భార్యే సువర్చలా దేవి.. ది డాటర్‌ ఆఫ్‌ గాడ్‌ సన్‌..
సువర్చలాదేవి.. సూర్యుని కూతురు..ఆమెను ఆంజనేయుడు పెళ్లి చేసుకున్నాడట.. హనుమజ్జయంతి రోజునే ఆయన పెళ్లి వేడుకలనూ దేశంలోని అనేక ఆలయాల్లో జరపటం ఆనవాయితీగా కూడా మారిపోయింది…
హనుమంతుడు పసివాడిగా ఉన్నప్పుడే సూర్యుణ్ణి పండుగా భావించి ఎగిరి అందుకోబోయాడట.. అలా సూర్యుణ్ణి చేరిన హనుమంతుడు ఆయన దగ్గరే సకల విద్యలనూ అభ్యసించాడు.. విద్యలన్నీ పూర్తయిన తరువాత సూర్యుడు హనుమంతుడిని కోరిక కోరాడట.. తన కుమార్తె సువర్చలా దేవిని వివాహం చేసుకోవాలన్నది ఆ కోరికట..
గురువుగారి కోరిక విని హనుమంతుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. తానేమో ఘోటక బ్రహ్మచారి.. తానెలా పెళ్లి చేసుకోవటం.. అదే గురువుగారికి చెప్పుకున్నాడు.. కానీ, సూర్యభగవానుడు ఒత్తిడి చేయటంతో సంసార బాధ్యతలతో నిమిత్తం లేకుండా నామమాత్రంగా వివాహం చేసుకునేందుకు ఆంజనేయస్వామి అంగీకరించాడట.. అలా సువర్చలాదేవితో హనుమంతుడికి వివాహం అయిందని పురాణాల్లో చెప్పారు..
శ్రీరామ నవమినాడు సీతారామ కల్యాణాన్ని ఎలాగైతే జరుపుకుంటామో.. అలాగే హనుమత్‌ జయంతి రోజున సువర్చలాంజనేయుల వివాహాన్ని వైభవంగా జరుపుకుంటున్నారు..
అయినా చాలామందిలో మాత్రం హనుమంతుడికి వివాహం చేయటం అనేది వింతగా కనిపిస్తోంది.. మరి కొందరిలో ఆగ్రహాన్నీ తెప్పిస్తోంది. ఏవో పురాణాల్లో ఏవేవో కథలు ఉన్నాయని చూపించి బ్రహ్మచర్యానికి ఆదర్శపురుషుడైన ఆంజనేయుడికి వివాహం చేయటం సబబు కాదని ఇంకొందరి వాదన…
పెళ్లిళు్ల చేసే వారికి మాత్రం ఇవేవీ అవసరం లేదు.. తమ స్వామి వారు బ్రహ్మచారి కానే కాదన్నది వారి బలమైన విశ్వాసం.. అదే వారికి నిజం..
హనుమంతుడి వివాహంపై చాలా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన పెళ్లి కథ ఒకటైతే… సంతానం కథ ఇంకోటి.. ఆ సంతానంతో ఫైట్‌ చేసిన కథ మరోటి.. ప్రతి కథా తెగ ఇంటరెస్‌‌ట కలిగిస్తుంది.. ఒక్కో పురాణం ఒక్కో సందర్భంలో ఒక్కో కథనాన్ని వినిపిస్తుంది.. ఆ కథనాలు ప్రజల్లోకి ప్రచారంలోకి వచ్చేసరికి అబ్బో బోలెడు రూపాంతరాలు చెందుతాయి.
పరాశర సంహిత చెప్పిన కథనం ప్రకారం సూర్యుడి కోరికతో సువర్చలా దేవిని ఆంజనేయుడు వివాహం చేసుకున్నాడు.. ఆమెను వివాహం చేసుకున్నా.. ఆంజనేయుడు బ్రహ్మచర్య దీక్షను విడిచిపెట్టలేదట… అందుకే ఆయనకు వివాహం చేయటమూ తప్పుకాదు.. ఆయన పేరుతో బ్రహ్మచర్య దీక్షలు చేపట్టడమూ తప్పు కాదంటారు ఆధ్యాత్మిక వేత్తలు.
లంకానగరంలో సీతాదేవిని అన్వేషించటానికి హనుమంతుడు వెళ్లినప్పుడు రావణుడు ఆయన తోకకు నిప్పంటించాడు.. ఆ నిప్పుతో లంకను ఆంజనేయుడు కాల్చేశాడు.. ఆ తరువాత ఆంజనేయుడు సముద్రంలో తోకకు అంటిన అగ్గిని ఆర్చుకుని తిరిగి వెళు్తన్నప్పుడు ఆయన చెమట బిందువు సముద్రంలో ఒక చేప మింగిందిట.. తద్వారా ఆ చేప పుత్ర సంతానాన్ని పొందింది.. ఆ కుమారుడి పేరు మకరధ్వజుడు..
ఈ మకరధ్వజుడు పెరిగి పెద్దవాడై, మైరావణుడి ప్రాణాలకు కాపలా ఉన్నాడట.. మైరావణుడి ప్రాణాలను హరించటానికి వచ్చిన ఆంజనేయుడు కుమారుడితో యుద్ధం చేయాల్సి వచ్చిందిట.. యుద్ధం తరువాత వాస్తవం తెలుసుకుని కుమారుణ్ణి ఆశీర్వదించి వెళ్లాడట ఆంజనేయుడు..
హనుమంతుడి గురించి ఇలా ఎన్ని కథనాలైనా ప్రచారంలో ఉండి ఉండవచ్చు. కానీ, ఆయన బ్రహ్మచర్యానికి ఉన్న బలం ఈ కథనాలకు ఎంతమాత్రం కనిపించదు.. హనుమత్‌ దీక్షలు స్వీకరించేవారు కొల్లలుగా ఉన్నారు.. ఆయనను ఆజన్మ బ్రహ్మచారిగానే విశ్వసించేవారు ఎక్కువమంది ఉన్నారు.
హనుమంతుడి వివాహం అన్నది ఇప్పుడు దేశమంతటా చర్చగా మారింది.. ఆయన బ్రహ్మచర్య దీక్షకు మచ్చ పడే ప్రమాదం ఏర్పడింది.. తన భక్తుల్లో చెలరేగిన ఈ వివాదాన్ని చూసి బహుశా ఆంజనేయుడు కూడా ఆశ్చర్యపడిపోతూ ఉంటాడు.. ఏమైనా దేవీ దేవుళ్ల విషయంలో ఇలాంటి కథలు ఎందుకు పుడతాయి? ఎలా పుడతాయి?
మన దేశంలో దేవుళ్లకు సంబంధించిన కథలు ఊరికే పుట్టవు.. ఒకే దేవుడికి సంబంధించి రకరకాల కథనాలు ఉంటాయి.. అసలు ఒక్కో దేవుడికి ఒక్కో ఆకారాన్ని కల్పించటం కూడా మన దగ్గర వింతే… ఎందుకంటే మన దేశంలో దేవతలకు సంబంధించిన అంశాల్ని డిస్కస్‌ చేసే పురాణాలు కానీ, ఇతర ఇతిహాసాల్లో కానీ ఒక సీక్రసీ తప్పనిసరిగా ఉంటుంది.. అంటే పైకి కనిపించే కథ వేరు…దాని వెనుక ఇండైరెక్‌‌టగా ఉండే ఉద్దేశ్యం వేరు…
ఈ డైరెక్టు, ఇండైరెక్టు ఏమిటని బురల్రు బద్దలు కొట్టుకోనవసరం లేదు.. చాలా సింపుల్‌లాజిక్‌… రామాయణం కథ కాసేపు పక్కన పెడదాం… ఇక హనుమంతుడికి కోతి రూపమే ఎందుకు ఉండాలి? జస్‌‌ట మీలో మీరు ప్రశ్నించుకోండి… మీకే జవాబు దొరికిపోతుంది..
పాయింట్‌ నెం.1
కోతి మనిషికి పూర్వరూపం అని అంటారు..
పాయింట్‌ నెం.2
కోతి అత్యంత చంచల స్వభావం కలిగింది.
పాయింట్‌ నెం.3
కోతి మనసు ఎప్పుడూ స్థిరంగా ఉండదు..
పాయింట్‌ నెం.4
మనిషి మనసు కూడా ఎప్పుడూ చంచలంగానే ఉంటుంది
పాయింట్‌ నెం. 5
ఇలాంటి చంచల స్వభావం కలిగిన వాళ్ల మనసులను స్థిరంగా ఉంచటం ఎలా?
పాయంట్‌ నెం.6
మెడిటేషన్‌ ఒక్కటే మార్గం..
పాయింట్‌ నెం.7
దాన్నే భక్తి అంటారు.
భక్తి అనేది ఒక కోతిని భగవంతునిగా మార్చింది.. చంచలమైన మనసు కలిగిన మనిషిని స్థిరచిత్తంతో ఉంచే లక్ష్యానికి ప్రతిరూపమే హనుమంతుడు. ఇవాళ ప్రపంచం అంతా మెడిటేషన్‌ చుట్టూ తిరుగుతోంది… మన అంజి, అదే ఆంజనేయుడు దీన్ని ఆనాడే చేసి చూపించాడు.. అంతే కాదు.. మానవుడైన రాముడికి సేవ చేయటం ద్వారా మనిషికి సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లేనని రుజువు చేసిన వాడు హనుమంతుడు..
ఇక సువర్చలా దేవితో వివాహం సంగతి… దీని వెనుక కూడా లాజిక్‌ లేకపోలేదు..
ప్రపంచంలో విద్యలన్నింటికీ సింబల్‌ వెలుగు.. వర్చస్సు అన్నా వెలుగే..
సు…. వర్చస్సు అంటే మంచి వెలుగు అని అర్థం.. ప్రపంచంలోని ఉన్నతమైన, ఉత్తమమైన విద్యలన్నింటినీ హనుమంతుడు సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడు. సూర్యుడి నుంచి పుట్టిన వెలుగే ఈ విద్యలు.. ఆ వెలుగే సువర్చల.. ఆ సువర్చలనే హనుమంతుడికి సూర్యుడు అందించాడు.. సువర్చలా వివాహం అనేది సామాన్యులకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పింది.. దాని మూట విప్పితేనే కదా.. మర్మమేమిటో తెలిసేది.. దీని గురించి వితండ వాదాలు చేయటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు.. మన దేవతల గురించి ఆలోచించేప్పుడు వారి వెనుక పెద్దలు చెప్పిన సైంటిఫిక్‌ లాజిక్‌ ఏముందో ఒక్కసారి ఆలోచించటం అవసరం.

———————————————————————-

7. సూర్యాంజనేయం……..!!

శ్రీఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనే స్తోత్రాలు చదివాం, విన్నాం కానీ ఈ సూర్యాంజనేయం అంటే? సూర్యుడు, ఆంజనేయుడికి ఉన్న సంబంధం మనం తెలుసుకోవలసిందే. వాల్మీకి రామాయణం, ఇతర పురాణాలు సూర్యుడికీ, హనుమంతుడికీ ఉన్న అనుబంధాన్ని సవివరంగా తెలియజేశాయి/ హనుమంతునికి సూర్యునితో ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనబడడు.
బాలాంజనేయుడికి సూర్యుడు ఆహారం : హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడు ఒకసారి ఉదయభానుడిని చూసి ఆకలిగా ఉన్న బాలాంజనేయుడు ఎఱ్ఱని సూర్యబింబాన్ని పండుగా భ్రమించి ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు. కాని ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైన విషయం మనకు తెలిసిందే. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుని ఆకర్షించాడు. ఇది సూర్యాంజనేయుల మొదటి అనుబంధం.

సూర్యశిష్యరికం :

బాల్యంలోనే గాక విద్యార్థి దశకు వచ్చాక కూడా హనుమంతుని దృష్టిని సూర్యుడు ఆకర్షించాడు. తనకు తగిన గురువు సూర్యుడేనని నిర్ణయించుకొని ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించి విద్యనూ అర్థించాడు. నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులభం కాదని సూర్యుడు హనుమంతునికి నచ్చజెప్పటానికి చూశాడు. కాని చివరికి హనుమంతుడి విద్యా జిజ్ఞాసను అర్థం చేసుకొని శిష్యుడిగా చేసుకోవడానికి సూర్యుడు అంగీకరించాడు. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యనూ అభ్యసించిన వివిధ పురాణాలు వేరు వేరుగా చెబుతున్నాయి. ఉదయాద్రిపై ఒక పాదం, అస్తాద్రిపై ఒక పాదం ఉంచి నిత్యం సంచరించే సూర్యుని దగ్గర హనుమంతుడు వేదవేదాంగాలు, ఆరు శాస్త్రాలు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, నాటకాలంకారాలు, 64 కళలు అభ్యసించాడు (గడియకు లక్షా డెబ్బై వేళ యోజనాల వేగంతో ప్రయాణించే సూర్యరథంతో సమానంగా సంచరిస్తూ హనుమంతుడు విద్యాభ్యాసం చేశాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి) జిజ్జ్వల్యమానంగా ప్రకాశించే నిత్య గమనశీలి సూర్యుని వద్ద శిష్యరికం చేసిన ఘనుడు వాయుపుత్రుడు ఒక్కడే. సూర్యుని శిష్యరికం వల్లనే శ్రీరాముని మొదటి సమగామంలోనే తన సంభాషణా చాతుర్యంతో హనుమంతుడు ఆకర్షించగలిగాడు. మైనాకుని వినయంతోను, సింహికను శక్తితోను, సురసను యుక్తితోను జయించగలగడం సూర్యుని దగ్గర నేర్చుకున్న 64 కళల ఫలితమే.

సూర్యుపుత్రునికి స్నేహితుడు :

సూర్యభగవానుని శిష్యుడైన హనుమంతుడు సూర్యపుత్రుడైన సుగ్రీవునికి మంత్రిగా, మిత్రునిగా సలహాలను, సహాయాన్ని అందించాడు. వాలికి భయపడి దేశాలు పట్టి తిరిగిన కాలంలో సుగ్రీవునికి చేదోడు వాదోడుగా మెలిగాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవునికి, సూర్యవంశీయుడైన శ్రీరామునికి చెలిమి ఏర్పడటానికి కారకుడు ఆంజనేయుడే. అంతేగాక రావణ సంహారానికి తోడ్పడే నరవానర మైత్రికి బీజం వేసినవాడు కూడా హనుమంతుడే.

సూర్యుని మనుమడు : కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి సూర్యుసుతుడైన సుగ్రీవునికి సోదరి. అంటే హనుమంతుడు సుగ్రీవునికి మేనల్లుడు. కనుక సూర్యుడు హనుమంతుడికి తాత.

సూర్యుని అల్లుడు :

వాల్మీకి రామాయణంలో హనుమంతుని వివాహం గురించి కాని, భార్య గురించి కాని ఎటువంటి ప్రస్తావన లేదు. కొన్ని పురాణాల ప్రకారం సూర్యభగవానుని కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య. అంటే సూర్యాంజనేయుల మధ్య మామా అల్లుళ్ళ సంబంధం కూడా ఉంది. పార్వతీదేవి అంశతో అయోనిజగా సువర్చల జన్మించింది.

సూర్యవంశీయుని భక్తుడు :

హనుమంతుని ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు కావడం విశేషం. తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుని సేవించుకునే మహాద్భాగ్యం హనుమంతునికి దక్కింది. గురువు ఋణం తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం. శ్రీరామునితో పరిచయమైనా నాటినుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు. అనితర సాధ్యమైన సముద్ర లంఘనం చేసి, శత్రు దుర్భేద్యమైన లంకలో సీతమ్మ జాడ కనిపెట్టడం ద్వారా శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. సంజీవినిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు. సీతారాములను హృదయంలో నిలుపుకోవడం హనుమంతుని భక్తికి పరాకాష్ట. శ్రీరామభక్తులకు హనుమంతుడు సర్వదా సంరక్షకుడిగా ఉంటాడు.

త్రిమూర్తుల శక్తి :

సూర్యవంశ సంజాతుడైన శ్రీరాముడు మహావిష్ణువు అవతారం. హనుమంతుడు శివాంశ సంభూతుడు. అంటే రామాంజనేయుల అనుబంధం శివకేశవుల అభేదానికి ప్రతీక. హనుమంతుని భవిష్యబ్రహ్మగా కూడా పురాణాలు పేర్కొన్నాయి. కనుక వీరిద్దరి కలయికతో త్రిమూర్తులు ఏకామైనట్టే. సూర్యుని కూడా త్రిమూత్రుల స్వరూపంగా శాస్త్రాలు నిర్వచించాయి. కాబట్టి శ్రీ సూర్యరామాంజనేయులను ద్విగుణీకృతమైన శక్తికి సంకేతంగా అభివర్ణించ వచ్చు. ఇలా గురుశిష్య బంధంగా మొదలైన సూర్యాంజనేయుల అనుబంధం త్రిమూర్త్యాత్మకంగా విస్తరించింది.

———————————————————————————-

6. అంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన కలుగు ప్రయోజనాలు ….
1. ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది.
2. ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబందమైన పీడలు తొలగిపోతాయి.
3. సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లబిస్తుంది.
4. కొందరు చిన్న పిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు. చాలా నీరసంగా కనిపిస్తుంటారు. ఇలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు.
5. వ్యాపారంలో చాల నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది.
6. ఏ వ్యక్తి అయితే హీనంగా చుడబడుతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది.
7. శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది
8. వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి.
9. సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది.
10. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్ధించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం కలుగుతుంది.
11. వాద ప్రతివాదాల్లో స్వామిని ప్రార్ధించిచి తమలపాకుల హరాన్ని సమర్పించి, ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది.
12. తాంబూల దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది. పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీనికి కూడా పర్ణ ప్రసాదమనే పేరు.

Sindoora-pushpam

5.  ఆంజనేయస్వామిని పూజిస్తే కలిగే ఫలితాలు…..!!!

స్వామికి తమలపాకులతో చేసే పూజ అత్యంత ప్రియం. సహస్ర నామార్చన, అష్టోత్తరములతో తమలపాకులు సమర్పించిన శుభం కలుగుతుంది. తమలపాకులు పూజకు ఉపయోగించుట మంగళకరం.
శతవృద్ధ జిల్లేడు, తెల్లజిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటితోటలో పూజించుట వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితాలను ఇస్తుంది.
అరటిపండ్ల నివేదన, సింధూర సమర్పణ, శని, మంగళవారములలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి. ఒకసారి సీతమ్మవారి పాపిట సింధూరాన్ని రాముడు ఇష్టపడతాడని తెలుసుకొని తన ఒంటినిండా సింధూరం పూసుకొన్న రామభక్తుడాయన. అందుకే స్వామికి సింధూరం అత్యంత ఇష్టమైనదిగా చెప్తారు.
హస్తమృగశీర్షానక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. భూత, ప్రేత పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగడానికి అభీష్టసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్ఠం.
స్వామి మహిమలు పరాశర సంహిత, ఉమాసంహిత, హనుమ సంహిత తదితర గ్రంథాలు చెబుతున్నాయి.
హనుమారాధన భోగ, మోక్షములను రెండింటినీ ఇస్తుంది. రామ భజన ఎక్కడ జరుగుతున్నా హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని భక్తుల విశ్వాసం.

4.   తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుంటే….!!

తరచూ గృహంలో స్పర్థలు వస్తుంటే, సమస్యలు ఉత్పన్నం అవుతుంటే, రామభజన చేస్తున్న ఆంజనేయస్వామి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచి, యథాశక్తి శ్రీరామనామ జపం చేయాలి. వీణవాయిస్తున్న హనుమంతుని చిత్రమైతే మరీ మంచిది.

 

3.  శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని,
విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది.
దానికి పరమేశ్వరుడు, “ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!” అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు,
భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.

2.   హనుమంతుని ఈ 12 నామాలు, పడుకొనేముందు, ప్రయాణ సమయమున పఠించిన మృత్యుభయం ఉండదు. సర్వత్రా విజయం కలుగును.

హనుమంతుని ద్వాదశనామాలు

హనుమా, అంజనాసుతః, వాయుపుత్రో, మహాబలః
రామేష్టః, ఫల్గుణ సఖః, పింగాక్షో మిత విక్రమః
ఉధధిక్రమణశ్చ్చైవ, సీతాశోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః, తస్య మృత్యు భయం నాస్తి సర్వత్రా విజయీ భవేత్

  • 1.  ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేస్తె ……….!!గమనిక – ఈ పరిహారాల్లో దేన్నైనా… ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేయాలి. స్త్రీలు మధ్యలో విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించి 41 రోజులు పూర్తి చేయవచ్చు.

1. అనారోగ్య సమస్యలు బాధిస్తున్నప్పుడు
అవనూనెతో దీపారాధన – ఆరోగ్యం

2. ఉపద్రవాలు ఆటంకాలు తొలగడానికి
గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం – ఈ ఐదింటిని పిండి చేసి, దీపప్రమిదగా చేసి, అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.

3. పెళ్ళి చూపుల్లో ఆకర్షణ ఏర్పడి వివాహం కావడానికి
బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి

4. శని వల్ల వచ్చే దోషాలు, తీవ్రమైన కష్టాలు, గాలిధూళి దోషాలు తొలగడానికి
నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి

5. కోరికలు నెరవేరేందుకు
బియ్యపు పిండి, గోధుమ పిండి సమపాళ్ళలో కలిపిన ప్రమిదలో దీపారాధన చేయాలి

6. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నిలవడానికి
కందిపిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి

7. దృష్టి దోషాలు పోయి, శత్రువుల మీద విజయం సాధించడానికి
పొట్టు తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి

8. వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు
ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, నువ్వుల నూనెలో కలిపి, దాంతో దీపారాధన చేయాలి.