Jammi chettu pooja, Sami Vruksham, విజయదశమి రోజున శమీ పూజ ఎందుకు చేయాలి?

By | October 5, 2017

What is The Best Thing of Jammi Tree | జమ్మి వృక్ష విశేషం |

facts about Jammi chettu

విజయదశమి రోజున శమీ పూజ ఎందుకు చేయాలి?

శమీపూజ ను విజయదశమి రోజునే ఎందుకు చేయాలి? అనేదానికి ఒక ముఖ్యమైన పురాణ ఔచిత్యం ఉంది. 
శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. ఇది సాధారణంగా అడవుల్లోను, ఆలయాల వద్ద, మైదానాల్లోను, పొలాల గట్ట వెంబడి కనిపిస్తూ ఉంటుంది. అనేక వృక్ష సంతతుల మాదిరిగానే ఇది కూడా ఒక ఔషద విలువలు కలిగిన చెట్టు. ఆయుర్వేదంలో చర్మసంబంధ వ్యాధులకు మందుగా జమ్మిచెట్టు ఆకులు, బెరడు వినియోగిస్తారు. 
శమీ శమయితే పాపం శమీ శతృ వినాశనీ

అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనీ

అంటూ విజయదశమి నాడు ప్రజలచే పూలజందుకుంటున్న మహిమాన్వతిమైన వృక్షం శమీవృక్షం. అందుకు కారణం ఏమిటి, విజయదశమి నాడే జమ్మి చెట్టకు ఎందుకు పూజలు చేయాలి, ఈ వృక్షం విశిష్టత ఏంటి అనే వివరాలు ఈ వీడియోద్వారా తెలుసుకోండి.

మనం జమ్మి చెట్టు అని పిలిచే శమీవృక్షం ప్రస్థావన రామాయణ, మహాభారతాల్లో మనకు కనిపిస్తుంది. రావణుని సంహరించే ముందు శ్రీరామచంద్రుడు, కౌరవులపై విజయాన్నిసాధించేముందు పాండవులు శమీ వృక్షానికి పూజలు చేశారు.

వారికి విజయాలను అందించిన శమీవృక్షాన్ని పూజిస్తే మనకు కూడా భవిష్యత్తులో విజయాలు లభిస్తామన్ననమ్మకంతో విజయ దశమి నాడు జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. అరణ్యవాసంలో శ్రీరాముడికి శమీవృక్షం కిందనే విశ్రాంతి తీసుకునేవాడని చెబుతారు.

త్రేతాయుగంలో శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమినాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది. అదే విధంగా శమీ పూజ చేసేందుకు మహాభారతకథ కూడా నిదర్శనంగా నిలుస్తోంది.

ద్వాపరయుగంలో పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద దాచిపెట్టి విరాటరాజు వద్ధ కొలువుకు వెళ్లారు. అజ్ఞాతవాసం ముగిసాక సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి శమీ వృక్షానికి సమస్కరించుకుని, ఆ ఆయుధాలు ధరించి అర్జుణుడు గోగ్రహణంలో కౌరవులపై విజయం సాధించాడు.

శమీ వృక్షం అపరాజితా దేవి రూపంగా కొలుస్తారు. తనను వేడినవారికి అపరాజితాదేవి సదా విజయాన్నే అందిస్తుంది. అందుకే శమీ వృక్షానికి అంత ప్రాముఖ్యత. విజయదశమినాటి ఆయుధపూజ వెనుక అంతర్యము కూడా ఇదే.

ఈ విధంగా తమకు విజయాలు వరించాలని విజయ దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి, ఆ చెట్టు ఆకులను తీసుకు వచ్చి, పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. ఈ ఆచారం తెలంగాణతో పాటు దక్షణాది రాష్ట్రాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.

శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా
ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ 
కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే

పై శ్లోకానికి అర్థం ఏంటంటే జమ్మి వృక్షాన్ని పూజిస్తే అది మన పాపాన్ని శమింపచేస్తుంది. శత్రువులను నాశనం చేస్తుంది. నాడు అర్జునుని ధనువును తన వద్ద భద్రపరుచుకొన్నది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది. యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది.