నాల్గవ అధ్యాయం – జ్ఞానయోగం Fourth Chapter

By | July 6, 2016

శ్రీమద్భగవద్గీత

నాల్గవ అధ్యాయం

జ్ఞానయోగం

శ్రీ భగవానువాచ:

ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ |
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే௨బ్రవీత్ || 1

శ్రీ భగవానుడు: వినాశనం లేని ఈ యోగం నేను పూర్వం సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువుకూ, మనువు ఇక్ష్వాకుడికీ బోధించారు.

ఏవం పరంపరాప్రాప్తమిమం రాజర్షయో విదుః |
స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప || 2

అర్జునా! ఇలా సంప్రదాయ పరంపరగా వచ్చిన కర్మయోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. అయితే అది ఈ లోకంలో క్రమేపి కాలగర్భంలో కలసిపోయింది.

స ఏవాయం మయా తే௨ద్య యోగః ప్రోక్తః పురాతనః |
భక్తో௨సి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ || 3

నాకు భక్తుడవూ, స్నేహితుడవూ కావడంవల్ల పురాతనమైన ఈ యోగాన్ని నీకిప్పుడు మళ్ళీ వివరించాను. ఇది ఉత్తమం, రహస్యమూ అయిన జ్ఞానం సుమా!

అర్జున ఉవాచ:

అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః |
కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి || 4

అర్జునుడు: సూర్యుడి జన్మ చూస్తే ఏనాటిదో, మరి నీవు ఇప్పటివాడవు. అలాంటప్పుడు నీవు సూర్యుడికి ఎలా ఉపదేశించావో ఊహించలేకపోతున్నాను.

శ్రీ భగవానువాచ:

బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున |
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప || 5

శ్రీ భగవానుడు: అర్జునా! నాకూ నీకూ ఎన్నో జన్మలు గడిచాయి. వాటన్నిటినీ నేను ఎరుగుదును. నీవు మాత్రం ఎరుగవు.

అజో௨పి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరో௨పి సన్ |
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా || 6

జననమరణాలు లేని నేను సర్వప్రాణులకూ ప్రభువునైనప్పటికీ నా పరమేశ్వర స్వభావం విడిచిపెట్టకుండానే నేను మాయాశక్తివల్ల జన్మిస్తున్నాను.

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ || 7

ఈ లోకంలో ధర్మం అధోగతిపాలై అధర్మం ప్రబలినప్పుడల్లా నేను ఉద్భవిస్తుంటాను.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || 8

సజ్జన సంరక్షణకూ, దుర్జన సంహారానికీ, ధర్మసంస్థాపనకూ నేను అన్ని యుగాలలోనూ అవతరిస్తుంటాను.

జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్త్వతః |
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో௨ర్జున || 9

అర్జునా! అలౌకికమైన నా అవతార రహస్యం యదార్థంగా ఎరిగిన వాడు ఈ శరీరం విడిచిపెట్టాక మళ్ళీ జన్మించడు. నన్నే చేరుతాడు.

వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః |
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః || 10

అనురాగం, భయం, కోపం విడిచిపెట్టి, నన్నే ఆశ్రయించి నామీదే మనస్సు లగ్నం చేసినవాళ్ళు ఎంతోమంది తత్వజ్ఞానమనే తపస్సువల్ల పవిత్రులై నన్ను పొందారు.

యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్ |
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః || 11

అర్జునా! ఎవరు ఎలాగ నన్ను ఆరాధిస్తారో వాళ్ళని అలాగే నేను అనుగ్రహిస్తాను. అందువల్ల నా మార్గమే మానవులు అన్నివిధాల అనుసరిస్తారు.

కాంక్షన్తః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః |
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా || 12

ఈ లోకంలో కర్మలకు ఫలం శీఘ్రంగా సిద్ధిస్తుంది. కనుకనే కర్మఫలం ఆశించి మానవులు దేవతలను ఆరాధిస్తారు.

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః |
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ || 13

వారివారి గుణాలకు, కర్మలకు తగ్గట్లుగా నాలుగు వర్ణాలు నేనే సృష్టించాను. అయినప్పటికీ వాటికి కర్తనైన నన్ను కర్తను కాదనీ, శాశ్వతుడననీ తెలుసుకో.

న మాం కర్మాణి లిమ్పన్తి న మే కర్మఫలే స్పృహా |
ఇతి మాం యో௨భిజానాతి కర్మభిర్న స బధ్యతే || 14

నన్ను కర్మలంటవనీ, నాకు కర్మఫలాపేక్ష లేదనీ గ్రహించినవాడిని కర్మలు బంధించవు.

ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః |
కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్ || 15

మోక్షం పట్ల ఆసక్తికలిగిన పూర్వులు కూడా ఈ విషయం గుర్తించే కర్మలు చేశారు. కనుక పురాతనకాలం నుంచీ వస్తున్న కర్మవిధానం నీవూ అనుసరించు.

కిం కర్మ కిమకర్మేతి కవయో௨ప్యత్ర మోహితాః |
తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్‌జ్ఞాత్వా మోక్ష్యసే௨శుభాత్ || 16

పండితులు కూడా కర్మ ఏదో, కర్మకానిది ఏదో తెలియక తికమకలవుతున్నారు. సంసారబంధాలనుంచి విముక్తి పొందడానికి అవసరమైన కర్మస్వరూపం వివరిస్తాను విను.

కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః |
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః || 17

కర్మ అంటే ఏమిటో, శాస్త్రాలు నిషేధించిన వికర్మ అంటే ఏమిటో, ఏపనీ చేయకపోవడమనే అకర్మ అంటే ఏమిటో తెలుసుకోవడం అవసరం. కర్మతత్వాన్ని గ్రహించడం కష్టసాధ్యం.

కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః |
స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ || 18

కర్మలో అకర్మ, అకర్మలో కర్మ చూసేవాడు మానవులలో బుద్ధిమంతుడు; యోగి; సమస్తకర్మలూ ఆచరించేవాడు.

యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః |
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః || 19

ఫలాసక్తి లేకుండా అన్ని కర్మలూ ఆచరించడంతోపాటు జ్ఞానమనే అగ్నితో పూర్వపు వాసనల్ని నాశనం చేసుకున్నవాడిని పండితుడని పెద్దలు చెబుతారు.

త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః |
కర్మణ్యభిప్రవృత్తో௨పి నైవ కించిత్కరోతి సః || 20

కర్మఫలాపేక్ష విడిచిపెట్టి నిత్యమూ సంతృప్తితో దేనిమీదా ఆధారపడకుండా, కర్మలు చేసేవాడు, ఏమీ చేయనివాడే అవుతాడు.

నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః |
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ || 21

వాంఛలు వదలిపెట్టి చిత్తమూ, మనస్సూ వశపరచుకుని, ఈ వస్తువు నాది అనేది లేకుండా కేవలం శరీరపోషణ కోసం కర్మలు ఆచరించేవాడు పాపం పొందడు.

యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః |
సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వా௨పి న నిబధ్యతే || 22

అప్రయత్నంగా లభించిన వస్తువులతో సంతృప్తి చెందుతూ, ఇతరులమీద ఈర్ష్యపడకుండా, సుఖదుఃఖాలకు లొంగకుండా జయాపజయాలపట్ల సమదృష్టి కలిగినవాడు కర్మలు చేసినా బంధాలలో చిక్కుకోడు.

గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః |
యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే || 23

దేనిమీదా ఆసక్తి లేకుండా, విముక్తి పొంది, మనస్సును ఆత్మజ్ఞానం మీదే నిలిపినవాడు భగవంతుడి ప్రీతికోసం కాని, లోకకళ్యాణార్థంకాని చేసే కర్మలన్నీ పూర్తిగా నశించిపోతాయి.

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా || 24

యజ్ఞంలోని హోమసాధనాలు, హోమద్రవ్యాలు, హోమాగ్ని, హోమం చేసేవాడు, హోమం చేయబడిందీ, హోమకర్మ పరబ్రహ్మ స్వరూపాలే అని భావించి యజ్ఞకర్మలు ఆచరించేవాడు పరబ్రహ్మనే పొందుతాడు.

దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే |
బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి || 25

దేవతలను ఉద్దేశించి కొంతమంది యోగులు యజ్ఞం చేస్తారు. మరి కొంతమంది బ్రహ్మమనే అగ్నిలో ఆత్మచేత తమ ఆత్మనే ఆహుతి చేస్తున్నారు.

శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి |
శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి || 26

కొంతమంది చెవిలాంటి ఇంద్రియాలను నిగ్రహం అనే అగ్నిలోనూ, మరికొంతమంది శబ్దాది విషయాలను ఇంద్రియాలనే అగ్నిలోనూ హోమం చేస్తున్నారు.

సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే |
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే || 27

కొందరు ఇంద్రియాలన్నిటి వ్యాపారాలూ, ప్రాణవ్యాపారాలూ జ్ఞానంతో ప్రకాశించే మనోనిగ్రహమనే అగ్నికి అర్పిస్తున్నారు.

ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథా௨పరే |
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః || 28

దానధర్మాలే యజ్ఞంగా కొంతమంది, తపస్సే యజ్ఞంగా కొంతమంది, యోగసాధనే యజ్ఞంగా కొంతమంది ఆచరిస్తున్నారు. కార్యదీక్ష, కఠోర వ్రతం కలిగిన మరికొంతమంది వేదాధ్యయనమే యజ్ఞమని భావించి స్వాధ్యాయ యజ్ఞమూ, జ్ఞానయజ్ఞమూ చేస్తున్నారు.

అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే௨పానం తథా௨పరే |
ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామపరాయణాః || 29

అలాగే ప్రాణాయామపరులు కొంతమంది ప్రాణవాయువు, అపానవాయువుల గతులను నిరోధించి అపానంలో ప్రాణమూ, ప్రాణంలో అపానమూ హోమం చేస్తున్నారు.

అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి |
సర్వే௨ప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః || 30

మరికొంతమంది ఆహారనియమంతో ప్రాణవాయువులను ప్రాణాలలోనే అర్పిస్తారు. యజ్ఞాలు తెలిసిన వీళ్ళంతా యజ్ఞాలవల్ల పాపపంకిలాన్ని క్షాళనం చేసుకుంటున్నారు.

యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ |
నాయం లోకో௨స్త్యయజ్ఞస్య కుతో௨న్యః కురుసత్తమ || 31

కురుకులభూషణా! యజ్ఞాలలో మిగిలిన అన్నమనే అమృతాన్ని భుజించేవారు శాశ్వత పరబ్రహ్మం పొందుతారు. యజ్ఞం ఒకటీ చేయనివాడికి ఇహలోక సుఖం లేదు; పరలోకసుఖం అసలేలేదు.

ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే |
కర్మజాన్ విద్ధి తాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే || 32

ఈ విధంగా వివిధ యజ్ఞాలు వేదంలో విశదీకరింపబడ్డాయి. అవన్నీ కర్మలనుంచి ఏర్పడ్డాయని తెలుసుకుంటే నీవు సంసారబంధం నుంచి విముక్తి పొందుతావు.

శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప |
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే || 33
అర్జునా ! ద్రవ్యం వల్ల సాధించబడే యజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం శ్రేష్ఠం. సమస్తకర్మలూ జ్ఞనంలోనే పరిసమాప్తం కావడం దీనికి కారణం.

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః || 34

తత్వవేత్తలైన జ్ఞానులు అలాంటి జ్ఞానం నీకు ఉపదేశిస్తారు. వారి వద్దకు వెళ్ళినప్పుడు వినయవిధేయతలతో నమస్కరించి, సమయం సందర్భం చూసి ప్రశ్నించి, సేవలు చేసి తెలుసుకో.

యద్‌జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ |
యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి || 35

ఆ జ్ఞానం తెలుసుకుంటే నీవు మళ్ళీ ఇలాంటి మోహం పొందవు. సమస్త ప్రాణులనూ నీలోనూ, నాలోనూ కూడా చూడగలవు.

అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః |
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి || 36

పాపాత్ములందరిలోనూ మహాపాపివైనాసరే, జ్ఞానమనే తెప్పతోనే పాపసాగరాన్ని దాటివేస్తావు.

యథైధాంసి సమిద్ధో௨గ్నిః భస్మసాత్కురుతే௨ర్జున |
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా || 37

అర్జునా ! బాగా మండుతున్న అగ్ని కట్టెలను ఎలా భస్మం చేస్తుందో అలాగే జ్ఞానమనే అగ్ని సర్వకర్మలనూ భస్మం చేస్తుంది.

న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే |
తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి || 38

ఈ ప్రపంచంలో జ్ఞానంతో సరితూగే పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. కర్మయోగసిద్ధి పొందినవాడికి కాలక్రమేణా అలాంటి జ్ఞానం ఆత్మలోనే కలుగుతుంది.

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః |
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి || 39

శ్రద్ధాసక్తులూ, ఇంద్రియనిగ్రహమూ కలిగినవాడు బ్రహ్మజ్ఞానం పొందుతాడు. జ్ఞానం కలిగిన వెంటనే పరమశాంతి లభిస్తుంది.

అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి |
నాయం లోకో௨స్తి న పరో న సుఖం సంశయాత్మనః || 40

అజ్ఞానం, అశ్రద్ధ, అనుమానం మనిషిని పాడుచేస్తాయి. అడుగడుగునా సందేహించేవాడికి ఇహలోకంలో కూడా సుఖశాంతులుండవు.

యోగసన్న్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయమ్ |
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ || 41

అర్జునా! నిష్కామకర్మయోగంవల్ల కర్మఫలాలు విడిచిపెట్టి, జ్ఞానంతో సంశయాలు పోగొట్టుకున్న ఆత్మజ్ఞానిని కర్మలు బంధించలేవు.

తస్మాదజ్ఞానసంభూతం హృత్‌స్థం జ్ఞానాసినాత్మనః |
ఛిత్త్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత || 42

అర్జునా ! అందువల్ల అజ్ఞానం మూలంగా నీ హృదయంలో కలిగిన ఈ సందేహాన్ని జ్ఞానమనే కత్తితో నరికివేసి, నిష్కామకర్మయోగం ఆచరించు. లేచి యుద్ధం చేయి.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని “జ్ఞానయోగం” అనే నాల్గవ అధ్యాయం సమాప్తం.