రెండవ అధ్యాయం – సాంఖ్యయోగం Second Chapter

By | July 6, 2016

శ్రీమద్భగవద్గీత

రెండవ అధ్యాయం

సాంఖ్యయోగం

సంజయ ఉవాచ:

తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్ |
విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః || 1

శ్రీ భగవానువాచ:

కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితమ్ |
అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున || 2

క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప || 3

సంజయుడు: దయామయుడైన అర్జునుడు కన్నీరు కారుస్తుండగా శ్రీ కృష్ణపరమాత్మ ఇలా అన్నాడు.

అర్జునా! ఈ సంక్లిష్ట సమయంలో ఆర్యధర్మ విరుద్ధమూ, అపకీర్తి దాయకమూ, నరకప్రాప్తి హేతువూ అయిన ఈ పాడుబుద్ధి నీ కెందుకు పుట్టింది? నపుంసకుడిలాగ అధైర్యం పొందకు. ఇది నీకు పనికిరాదు, మనోదౌర్బల్యం నీచం. దాన్ని విడిచిపెట్టు. నీవు శత్రుమర్దనుడవు కదా! యుద్ధం ప్రారంభించు.

అర్జున ఉవాచ:

కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన |
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన || 4

అర్జునుడు : మధుసూదనా! పూజార్హులైన భీష్మ ద్రోణాదులను బాణాలతో నేనెలా కొట్టగలను?

గురూనహత్వాహి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే |
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ || 5

మహానుభావులైన గురువులను చంపడం శ్రేయస్కరం కాదు. వారిని సంహరించి రక్తసిక్తాలైన రాజ్యభోగాలు అనుభవించడం కంటే బిచ్చమెత్తుకోవడం మేలు.

న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః |
యానేవ హత్వా న జిజీవిషామః
తే௨వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః || 6

యుద్ధం చేయడం మంచిదో కాదో తెలియడం లేదు. మనం జయిస్తామో, వారు జయిస్తారో చెప్పలేము. ఎవరిని చంపితే మనకు జీవితం మీద విరక్తి కలుగుతుందో ఆ ధార్తరాష్ట్రాదులే ఎదురుగా ఉన్నారు.

కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః |
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తే௨హం శాధి మాం త్వాం ప్రపన్నమ్ || 7

గురువులూ బంధువులూ అనే మమకార దోషంవల్ల నాబుద్ధి నశించింది. మంచి ఏదో చెడు ఏదో తెలియడం లేదు. శిష్యుడిగా నిన్ను ఆశ్రయించిన నాకు ఏది శ్రేయోమార్గమో దాన్ని ఆదేశించు.

న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్
యచ్ఛోక ముచ్ఛోషణమింద్రియాణామ్ |
అవాప్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ || 8

భూలోకాధిపత్యం లభించినా, స్వర్గాధిపత్యం సిద్ధించినా నా శోకం తగ్గుతుందనుకోను.

సంజయ ఉవాచ:

ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప |
న యోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవ హ || 9

సంజయుడు: అర్జునుడు శ్రీకృష్ణుడితో అలా చెప్పి యుద్ధం చేయనని ఊరకున్నాడు.

తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత |
సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః || 10

రెండుసేనల మధ్య విషాదవశుడైవున్న అర్జునుణ్ణి చూసి శ్రీ కృష్ణపరమాత్ముడు పరిహాసంగా ఇలా అన్నాడు.

శ్రీభగవానువాచ:

అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః || 11

అర్జునా! దుఃఖించనవసరం లేనివాళ్ళకోసం దుఃఖిస్తున్నావు. పైగా మహావివేకిలాగా మాట్లాడుతునావు. చచ్చిపోయినవాళ్ళ గురించికాని, బ్రతికున్నవాళ్ళ గురించి కాని వివేకులు శోకించరు.

న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః |
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ || 12

నీవూ నేనూ వీళ్ళంతా గతంలోనూ వున్నాము. భవిష్యత్తులో కూడా వుంటాము.

దేహినో௨స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా |
తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి || 13

జీవుడికి ఈ శరీరంలో కౌమారం, యౌవనం, వార్థక్యం వచ్చినట్లే మరణానంతరం మరో శరీరం వస్తుంది. ఇందుకు ధీరుడు దుఃఖించడు.

మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః |
ఆగమాపాయినో௨నిత్యాః తాం స్తితిక్షస్వ భారత || 14

కుంతీ పుత్రా! విషయాలకు వశమైన ఇంద్రియాలవల్ల శీతోష్ణాది గుణాలూ, సుఖదుఃఖాలూ కలుగుతుంటాయి. కోరికలకూ, ఇంద్రియాలకూ కలయిక అశాశ్వతం. కనుక ఓ భరతవీరా ! ఆ బాధలను సహించు.

యం హి న వ్యథయన్త్యేతే పురుషం పురుషర్షభ |
సమదుఃఖసుఖం ధీరం సో௨మృతత్వాయ కల్పతే || 15

పురుషవర్యా ! శీతోష్ణ సుఖదుఃఖాదులు ఎవడిని బాధించవో అలాంటి ధీరుడే ముక్తికి అర్హుడు.

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః |
ఉభయోరపి దృష్టో௨న్తః త్వనయో స్తత్త్వదర్శిభిః || 16

లేనిది ఎప్పటికీ వుండదు. ఉన్నది ఎప్పటికీ లేకపోదు. ఈ రెండింటి నిర్ణయం తత్వజ్ఞులకే తెలుస్తుంది.

అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ |
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్‌కర్తుమర్హతి || 17

ఈ విశ్వమంతటా వ్యాపించివున్న ఆత్మవస్తువు నాశనం లేనిది. దానినెవరూ అంతం చేయలేరు.

అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః |
అనాశినో௨ప్రమేయస్య తస్మాద్యుద్ధ్యస్వ భారత || 18

నాశనం లేని ఆత్మకు ఈ శరీరాలు శాశ్వతాలు కావు. ఆత్మ ఒక్కటే నిత్యం. కనుక ఓ భారత వీరా! యుద్ధం మొదలు పెట్టు.

య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్ |
ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే || 19

ఈ ఆత్మ చంపుతుందని కాని, చంపబడుతుందని కాని భావించే వాళ్ళిద్దరూ అజ్ఞానులే. ఆత్మ చంపేది కాని చచ్చేది కాని కాదు.

న జాయతే మ్రియతే వా కదాచిత్
నాయం భూత్వా భవితా వా న భూయః |
అజో నిత్యః శాశ్వతో௨యం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే || 20

ఆత్మకు పుట్టడం చావడం అనేవి లేవు. అది ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు లేకపోవడం జరగదు. జన్మరహితమూ, శాశ్వతమూ, అనాది సిద్ధమూ అయిన ఆత్మ నిత్యం. అందువల్ల శరీరాన్ని నాశనం చేసినా అందులోని ఆత్మ మాత్రం చావదు.

వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ || 21

పార్థా ! ఆత్మ నాశనరహితమనీ, చావు పుట్టుకలు లేనిదనీ, శాశ్వతమైనదనీ తెలుసుకున్నవాడు ఎవరినైనా ఎలా చంపుతాడు?ఎలా చంపిస్తాడు?

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో௨పరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ || 22

మానవుడు చినిగిపోయిన పాతబట్టలను విడిచిపెట్టేసి కొత్తబట్టలు వేసుకున్నట్లే ఆత్మ కృశించిన శరీరాలను వదలి కొత్త దేహాలు పొందుతుంది.

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః || 23

ఈ ఆత్మను ఆయుధాలు నరకలేవు; అగ్ని కాల్చలేదు; నీరు తడుపలేదు; గాలి ఎండబెట్టలేదు.

అచ్ఛేద్యో௨యమదాహ్యో௨యమక్లేద్యో௨శోష్య ఏవ చ |
నిత్యః సర్వగతః స్థాణురచలో௨యం సనాతనః || 24

ఆత్మ ఖండించరానిది, కాలనిది, తడవనిది, ఎండనిది; అది నిత్యం, సర్వవ్యాప్తం, శాశ్వతం, చలనరహితం, సనాతనం.

అవ్యక్తో௨యమచింత్యో௨యమవికార్యో௨యముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి || 25

ఆత్మ జ్ఞానేంద్రియాలకు గోచరించదు. మనస్సుకు అందదు. వికారాలకు గురికాదు. ఈ ఆత్మతత్వం తెలుసుకుని నీవు విచారించడం మాను.

అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ |
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి || 26

అర్జునా ! శరీరంతోపాటు ఆత్మకు కూడా సదా చావు పుట్టుకలుంటాయని భావిస్తున్నప్పటికీ నీవిలా శోకించవలసిన పనిలేదు.

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యే௨ర్థే న త్వం శోచితుమర్హసి || 27

పుట్టిన వాడికి చావు తప్పదు. చచ్చిన వాడికి పుట్టుక తప్పదు. తప్పించరాని ఈ విషయంలో తపించనవసరం లేదు.

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా || 28

జీవులు పుట్టుకకు పూర్వం కాని, మరణానంతరం కాని ఏ రూపంలో వుంటాయో తెలియదు. మధ్యకాలంలో మాత్రమే కనబడుతాయి. అర్జునా !అలాంటప్పుడు విచారమెందుకు?

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం
ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః |
ఆశ్చర్య వచ్చైనమన్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ || 29

ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంకొకడు దీన్ని గురించి విచిత్రంగా మాట్లాడుతున్నాడు. మరొకడు వింతగా వింటున్నాడు. అయితే ఈ ఆత్మ స్వరూపస్వభావాలు తెలుసుకున్న వాడు ఒక్కడూ లేడు.

దేహీ నిత్యమవధ్యో௨యం దేహే సర్వస్య భారత |
తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి || 30

అన్ని దేహాలలోనూ వుండే ఆత్మకు చావు అనేది లేదు. అందువల్ల ఈ ప్రాణుల గురించి నీవు దుఃఖించనక్కరలేదు.

స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితుమర్హసి |
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయో௨న్యత్ క్షత్రియస్య న విద్యతే || 31

నీ ధర్మాన్ని తెలుసుకుని అయినా నీవు జంకకు. ఎందుకంటే క్షత్రియుడికి ధర్మయుద్ధాన్ని మించిన మహాభాగ్యం మరొకటి లేదు.

యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ |
సుఖినః క్షత్రియాః పార్థ లబంతే యుద్ధమీదృశమ్ || 32

తెరచివుంచిన స్వర్గద్వారం లాంటి ఈ సంగ్రామం నీకు అప్రయత్నంగా లభించింది. ఇలాంటి సదవకాశం పుణ్యం చేసుకున్న క్షత్రియులే పొందగలుగుతారు.

అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి || 33

నీవు ఈ ధర్మయుద్ధం చేయకపోతే నీ కులధర్మమూ, పేరు ప్రఖ్యాతులూ పాడుచేసి పాపం కట్టుకంటావు.

అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే௨వ్యయామ్ |
సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే || 34

అంతే కాకుండా నీ అపకీర్తిని ప్రజలు చిరకాలం చెప్పుకుంటారు. పరువు ప్రతిష్ఠలున్నవాడికి అపనిందకంటే మరణమే మంచిది.

భయాద్రణాదుపరతం మంస్యన్తే త్వాం మహారథాః |
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ || 35

ఇన్నాళ్ళూ నిన్ను మహావీరుడిగా గౌరవిస్తున్న వాళ్ళంతా, భయపడి యుద్ధం మానేశావని భావించి చులకనగా చూస్తారు.

అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవా௨హితాః |
నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ || 36

నీ శత్రువులు నీ పరాక్రమాన్ని నిందిస్తూ అనరాని మాటలెన్నో అంటారు. అంతకుమించిన దుఃఖమేముంది?

హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ |
తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః || 37

అర్జునా ! ధర్మయుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు. శత్రువులను జయిస్తే రాజ్యభోగాలు అనుభవిస్తావు. అందువల్ల కృతనిశ్చయంతో యుద్ధానికి నడుం బిగించు.

సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జాయాజయౌ |
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి || 38

సుఖదుఃఖాలూ, లాభనష్టాలూ, జయాపజయాలూ సమానంగా భావించి సమరం సాగించు. అప్పుడు నీకు పాపం కలగదు.

ఏషా తే௨భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు |
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి || 39

పార్థా ! ఇంతవరకూ నీకు సాంఖ్యమతానుసారం ఆత్మతత్వం గురించి చెప్పాను. ఇక సంసారబంధం వదులుకోవడానికి సాధనమైన నిష్కామ కర్మయోగం గురించి చెబుతాను విను.

నేహాభిక్రమనాశో௨స్తి ప్రత్యవాయో న విద్యతే |
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ || 40

ఈ కర్మయోగం ప్రారంభించి, పూర్తి చేయలేకపోయినా వృథాగా పోదు; దోషం లేదు. ఏ కొద్దిగా ఆచరించినా ఈ యోగం దారుణమైన సంసారభయం నుంచి కాపాడుతుంది.

వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన |
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో௨వ్యవసాయినామ్ || 41

కురునందనా ! నిశ్చయాత్మకమైన బుద్ధి ఒకే విధంగా వుంటుంది. స్థిరసంకల్పం లేనివాళ్ళ ఆలోచనలు పరిపరివిధాల పరుగులెడతాయి.

యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః |
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః || 42

కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ |
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి || 43

భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్ |
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే || 44

పార్థా ! అవివేకులూ, అర్థవాదాలపట్ల ఆసక్తికలవాళ్ళూ, స్వర్గసుఖాలకు మించి మరొకటి లేదని వాదించేవాళ్ళూ వేదవాక్యాలు పలుకుతుంటారు. అలాంటి వాళ్ళు తాము చేసిన వైదిక కర్మల ఫలితంగా స్వర్గసుఖాలు అనుభవించాక, వాళ్ళకు మళ్ళీ కర్మభూమిలో పునర్జన్మ రూపమైన కర్మఫలమే తప్ప మోక్షం లభించదు. భోగభాగ్యాలు కోరి వేదవాక్యాలకు వశులైనవారి బుద్ధి నిలకడగా వుండదు.

త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ || 45

అర్జునా ! వేదాలు మూడుగుణాలు కలిగిన కర్మకాండలను వివరిస్తాయి. నీవు త్రిగుణాలనూ విడిచిపెట్టి, ద్వంద్వాలు లేనివాడవై యోగక్షేమాలు కోరకుండా శుద్ధ సత్వగుణం అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి.

యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే |
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః || 46

నదినుంచి నీరుతెచ్చుకునేవాళ్ళు నూతికి ఎలా ప్రాముఖ్యమివ్వరో అలాగే బ్రహ్మజ్ఞానులు ప్రతిఫలాపేక్షతో కూడిన వేదకర్మలకు ప్రాధాన్యం ఇవ్వరు.

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగో௨స్త్వకర్మణి || 47

కర్మలు చేయడం వరకే నీకు అధికారం. కర్మఫలంతో నీకు సంబంధం లేదు. కనుక ప్రతిఫలం ఆశించి కర్మచేయకు. అలా అని కర్మలు మానడానికి చూడకు.

యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ |
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే || 48

ఫలం దక్కినా దక్కక పోయినా కర్మలు సమభావనతో సాగించు. అర్జునా ! ఈ సమదృష్టినే యోగమంటారు.

దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ |
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః || 49

ధనంజయా ! ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ నిష్కామకర్మకంటే హీనం, ఫలితం ఆశించి కర్మచేసేవాళ్ళు అల్పులు. అందువల్ల నీవు సమబుద్ధినే ఆశ్రయించు.

బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే |
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ || 50

సమభావన కలిగిన పురుషుడు పుణ్యపాపాలు రెండింటినీ ఈ లోకంలోనే వదిలేస్తున్నాడు. కనుక సమత్వబుద్ధి అయిన నిష్కామకర్మనే నీవు ఆచరించు. కౌశలంతో కర్మలు చేయడమే యోగమని తెలుసుకో.

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః |
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ || 51

నిష్కామయోగులు కర్మఫలం ఆశించకుండా జన్మబంధాలనుంచి తప్పించుకుని, ఉపద్రవంలేని మోక్షం పొందుతున్నారు.

యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి |
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ || 52

నీ బుద్ధి అజ్ఞానమనే కల్మషాన్ని అధిగమించినప్పుడు నీకు విన్న విషయాలూ, వినబోయే అర్థాలూ విరక్తి కలిగిస్తాయి.

శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా |
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి || 53

అర్థవాదాలు అనేకం వినడం వల్ల చలించిన నీ మనస్సు నిశ్చలంగా వున్నప్పుడు నీవు ఆత్మజ్ఞానం పొందుతావు.

అర్జున ఉవాచ:

స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ |
స్థితధీః కిం ప్రభాషేత? కిమాసీత? వ్రజేత కిమ్? || 54

అర్జునుడు: కేశవా ! సమాధినిష్ఠ పొందిన స్థితప్రజ్ఞుడి లక్షణాలేమిటి? అతని ప్రసంగమూ, ప్రవర్తనా ఎలా వుంటాయి?

శ్రీ భగవానువాచ:

ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ |
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే || 55

శ్రీకృష్ణభగవానుడు: మనసులోని కోరికలన్నిటినీ విడిచిపెట్టి, ఎప్పుడూ ఆత్మానందమే అనుభవించేవాడు స్థితప్రజ్ఞుడు.

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః |
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే || 56

దుఃఖాలకు క్రుంగనివాడూ, సుఖాలకు పొంగనివాడూ, భయమూ, రాగద్వేషాలూ వదిలిపెట్టినవాడూ అయిన మునీంద్రుడు స్థితప్రజ్ఞుడవుతాడు.

యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ |
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 57

స్నేహవ్యామోహాలు లేకుండా వ్యవహరిస్తూ శుభాశుభాలు కలిగినప్పుడు సంతోషం, ద్వేషం పొందకుండా వుండేవాడు స్థితప్రజ్ఞుడు.

యదా సంహరతే చాయం కూర్మో௨0గానీవ సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 58

తాబేలు తన అవయవాలను లోపలికి ఎలా ముడుచుకుంటుందో అలాగే ఇంద్రియాలను సర్వవిధాల విషయసుఖాలనుంచి మళ్ళించిన వాడు స్థితప్రజ్ఞుడవుతాడు.

విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః |
రసవర్జం రసో௨ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే || 59

ఆహారం తీసుకోనివాడికి ఇంద్రియవిషయాలు అణగిపోతాయి. అయితే విషయ వాసన మాత్రం వదలదు. ఆత్మదర్శనంతో అది కూడా అడుగంటిపోతుంది.

యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః |
ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః || 60

కుంతీనందనా ! ఆత్మనిగ్రహం కోసం అమితంగా ప్రయత్నించే విద్వాంసుడి మనసును సైతం ఇంద్రియాలు బలవంతంగా లాగుతాయి.

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః |
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 61

యోగసాధకుడు ఇంద్రియాలన్నింటినీ వశపరచుకుని నామీదే మనస్సు వుంచాలి. అలాంటివాడి ప్రజ్ఞ సుస్థిరమవుతుంది.

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే |
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో௨భిజాయతే || 62

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః |
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి || 63

ఎప్పుడూ శబ్దాది విషయాల గురించే ఆలోచించే వాడికి వాటిమీద ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆసక్తివల్ల కోరికలు పుడతాయి. కోరికలు కోపం కలగజేస్తాయి. కోపం మూలంగా అవివేకం కలుగుతుంది. అవివేకంవల్ల మరపు, మరపువల్ల బుద్ధి నశించడం, బుద్ధి నాశనం వల్ల తానే నశించడం జరుగుతుంది.

రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ |
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి || 64

మనసును నిగ్రహించుకుని రాగద్వేషాలు లేకుండా తన అదుపాజ్ఞలలో వున్న ఇంద్రియాల వల్ల విషయసుఖాలు అనుభవించేవాడు మనశ్శాంతి పొందుతాడు.

ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే |
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే || 65

మనస్సు నిర్మలమైతే సమస్త దుఃఖాలూ సమసిపోతాయి. మనసు నిర్మలంగా వున్నవాడి ప్రజ్ఞకు చలనం లేదు.

నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా |
న చాభావయతశ్శాంతిః అశాంతస్య కుతస్సుఖమ్ || 66

మనోనిగ్రహం లేనివాడికి ఆత్మవివేకం కాని ఆత్మచింతన కాని అలవడవు. అలాంటివాడికి మనశ్శాంతి వుండదు. మనశ్శాంతి లేనివాడికి సుఖం శూన్యం.

ఇంద్రియాణాం హి చరతాం యన్మనో௨ను విధీయతే |
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి || 67

సుడిగాలి చుక్కాని లేని నావను దిక్కుతోచకుండా చేసినట్లు, ఇష్టానుసారం ప్రవర్తించే ఇంద్రియాలకు లొంగిపోయిన మనస్సు పురుషుడి బుద్ధిని పాడు చేస్తుంది.

తస్మాద్యస్య మహాబాహో ! నిగృహీతాని సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 68

అర్జునా ! అందువల్ల విషయసుఖాల వైపుకు వెళ్ళకుండా ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడికి స్థిరమైన బుద్ధి కలుగుతుంది; వాడే స్థితప్రజ్ఞుడు.

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ |
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః || 69

ఆత్మానుభూతిలేని అన్ని ప్రాణులకూ రాత్రిగాతోచే సమయంలో మనోనిగ్రహం కలిగిన ముని మేలుకుని వుంటాడు. విషయాలపట్ల ఆసక్తితో సర్వప్రాణులూ మెలకువగా వున్నపుడు ఆత్మనిష్ఠకలిగిన యోగికి రాత్రి అవుతుంది.

ఆపూర్యమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ |
తద్వత్‌కామా యం ప్రవిశంతి సర్వే
స శాంతిమాప్నోతి న కామకామీ || 70

నిరంతరం నిండుతున్నప్పటికీ చలించకుండా నిలిచిన సముద్రంలో నదీజలాలు ఎలా ప్రవేశిస్తాయో అలాగే ఎవడిలో కామాలన్నీ లీనమై అణగిపోతాయో వాడు శాంతి పొందుతాడు. భౌతిక సుఖాలకు బానిస అయినవాడికి మోక్షం లేదు.

విహాయ కామాన్ యః సర్వాన్‌పుమాంశ్చరతి నిఃస్పృహః |
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి || 71

కోరికలన్నిటినీ విడిచిపెట్టి ఆశ, అహంకారం, మమకారం లేకుండా మెలగేవాడు పరమశాంతి పొందుతాడు.

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వా௨స్యామంతకాలే௨పి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి || 72

అర్జునా ! ఇలా బ్రహ్మజ్ఞానం పొందినవాడి దృష్టి ప్రపంచవిషయాల మీదకు మళ్ళీ మళ్ళదు. జీవితం చివరిఘట్టంలో అయినా అలాంటి జ్ఞానం కలిగితే మోక్షం లభిస్తుంది.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని “సాంఖ్యయోగం” అనే రెండవ అధ్యాయం సమాప్తం.