Bhogi Pallu – భోగి పళ్లు ఎందుకు పోస్తారంటే!

By | January 13, 2016

భోగి పళ్లు ఎందుకు పోస్తారంటే!

తెలుగువారి జీవితాలలో సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో, దాని ముందు రోజున వచ్చే భోగికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే రేగుపళ్లే గుర్తుకువస్తాయి. ఆ రోజున రేగుపళ్లు కాస్తా భోగిపళ్లుగా మారిపోతాయి. సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. గుప్పిట నిండా రేగుపళ్లు, చిల్లర డబ్బులు, బంతిపూలరెక్కలు, చెరుకు ముక్కలని తీసుకుని…. మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు. భోగినాడు రేగుపళ్లని ఇంతగా తల్చుకోవడానికి చాలా కారణాలే కనిపిస్తాయి.

రేగు భారతదేశపు ఉపఖండంలోనే ఆవిర్భవించిందని ఓ నమ్మకం. అందుకు అనుగుణంగానే దీన్ని ‘ఇండియన్‌ డేట్‌’ అనీ ‘ఇండియన్‌ జుజుబీ’ అనీ పిలుస్తారు. అందుకు తగినట్లుగానే మన పురాణాలలోనూ దీని ప్రస్తావన కనిపిస్తుంది. సాక్షాత్తూ ఆ నరనారాయణులు ఈ బదరీ వృక్షం (రేగుచెట్టు) వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారనీ, ఆ ఫలాలని తింటూ తమ తపస్సుని కొనసాగించారనీ ప్రతీతి. అందుకే ఆ ప్రదేశానికి బదరీక్షేత్రం అన్న పేరు వచ్చిందని చెబుతారు. భారతీయ వాతావరణానికి తగినట్లుగానే రేగు చెట్టు ఎలాంటి ఒడుదొడుకులనైనా ఎదుర్కొని పెరుగుతుంది. -15 డిగ్రీల నుంచి విపరీతమైన 50 డిగ్రీల వరకూ ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుని నిలబడుతుంది.

దక్షిణభారతదేశంలో సంక్రాంతినాటికి ఈ రేగుపళ్లు అందుబాటులోకి వస్తాయి. పుల్లపుల్లగా ఉండే ఈ రేగు పళ్లు తినడానికి రుచిగా ఉండటమే కాదు, సకల ఆరోగ్యాలనూ అందించే ఔషధి గుణాలతో నిండి ఉంటాయి. మన దేశంలోనే కాకుండా తూర్పుదేశాలన్నింటిలోనూ రేగుని తమ సంప్రదాయ వైద్యంలో వాడతారు. జలుబు దగ్గర నుంచీ సంతానలేమి వరకూ రేగుని అన్నిరకాల రుగ్మతలకీ దివ్యౌషధంగా భావిస్తారు. రేగుపళ్లు ఉన్నచోట క్రిమికీటకాలు దరిచేరవని ఒక నమ్మకం. ఈ పండ్ల నుంచి వచ్చే వాసన మనసు మీద ఆహ్లాదకరమైన ప్రభావం చూపిస్తుంది. భూటాన్‌లో అయితే కేవలం ఇంటిని సువాసనభరితంగా ఉంచేందుకు ఈ పళ్లను మరిగిస్తారు.

భోగిరోజున దిష్టి తీసిన పళ్లను తినకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ, పిల్లలు తినేందుకు కావల్సినన్ని రేగుపళ్లు ఈ రోజు అందుబాటులో ఉంటాయి. ఈ భోగి పళ్లను ఐదేళ్లలోపు పిల్లలకి పోస్తారు. ఈ వయసులో ఉన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఊపిరితిత్తులూ, జీర్ణవ్యవస్థ చాలా బలహీనంగా ఉంటాయి. రేగుపళ్లు నిజంగా వీరిపాలిట అమృతంలా పనిచేస్తాయి. ఎందుకంటే రేగుపళ్లలో ‘సి’విటమిన్‌ చాలా ఎక్కువగా ఉండి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. పైగా జీర్ణసంబంధమైన వ్యాధులను నివారించేందుకు, ఉదరసంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగుపళ్లు ఉపయోగపడతాయి.అందుకే రేగుపళ్లని ఎండుపెట్టి వాటితో వడియాలను, రేగుతాండ్రనూ చేసుకుని తినే అలవాటు ఇప్పటికీ తెలుగునాట ఉంది.

ఇక రేగుపళ్లతోపాటు బంతిపూల రెక్కలని వాడటం వల్ల కూడా పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయి. ఎందుకంటే బంతిపూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములని చంపడమే. పైగా ఇది చర్మానికి తగిలితే చాలా మంచిది కూడా! చర్మసంబంధమైన ఎలాంటి వ్యాధినుంచైనా ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంది. బంతిపూల నుంచి తయారుచేసిన ‘కేలెండ్యులా’ ఆయింట్‌మెంట్‌ని హోమియోపతిలో చాలా విస్తృతంగా వాడతారు. భోగిపళ్ల సంస్కృతి ఇంత గొప్పదని తేలాక తెలుగువారు దాన్ని ఆచరించకుండా ఎలా ఉంటారు?